ప్రాణం తీసిన అతి వేగం

ప్రాణం తీసిన అతి వేగం
  • అదుపు తప్పి లోయలో పడిన టెంపో 
  • నలుగురి మృతి, ఆరుగురికి గాయాలు 
  • బూర్గంపాడు శివారులో దుర్ఘటన 

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:-మితి మీరిన వేగం నాలుగు ప్రాణాలను బలిగొంది. దేవుడిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళుతూ నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతం బూర్గంపాడు శివారులో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం తిరుమలదేవిపెట గ్రామానికి చెందిన భక్తులు భద్రాచలం వచ్చారు. రాముడిని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. అతి వేగం కారణంగా వీరు ప్రయాణిస్తున్న టెంపో అదుపు తప్పి లోయలో పడిపోయింది. వాహనంలో ఉన్న నలుగురు  అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయినవారిలో జట్ల దుర్గారావు (40),  పచ్చిపాల శ్రీనివాసరావు (38),  ప్రదీప్ (14) , సందీప్ (12)  ఉన్నారు. ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.