మణిపూర్‌లో మళ్లీ హింస 

మణిపూర్‌లో మళ్లీ హింస 
  • 9 మంది మృతి 10 మందికి  తీవ్ర గాయాలు
  • వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
  • మరోసారి కర్ఫ్యూ విధించిన పోలీసులు

ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.  గత 24 గంటలలో తిరిగి భారీగా అల్లర్లు జరిగాయి. ఖమేన్‌ లోక్‌ ఏరియాలో గత అర్ధరాత్రి ఉన్నట్టుండి ఫైరింగ్ జరిగింది. తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయినవారిలో ఓ మహిళ కూడా ఉంది. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి శరీరాలపై లోతైన గాయాలున్నాయని, బుల్లెట్‌ గాయాలు కూడా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. దాదాపు నెల రోజులుగా గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఇక్కడ ఘర్షణ జరుగుతోంది. తాజా ఘటనతో మరోసారి కర్ఫ్యూ విధించారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇంఫాల్, కంగ్‌పోక్పి సరిహద్దులోని ఖమేన్‌లోక్‌లో  హింస చెలరేగుతోంది. దాదాపు రెండు రోజులుగా ఇక్కడి వాతావరణం వేడిగానే ఉంది.  ఇప్పటి వరకూ మణిపూర్‌లోని  హింసాత్మక ఘటనల కారణంగా దాదాపు వంద మంది చనిపోయినట్టు అంచనా.  

కాల్పులు ఇలా

ఈస్ట్ ఇంపాల్ ఎస్పీ శివకాంత్ సింగ్ కథనం ప్రకారం, మిలిటెంట్లు అత్యాధునిక ఆయుధాలతో ఖమెలాక్ ప్రాంతంలోని గ్రామస్థులను అర్ధరాత్రి చుట్టుముట్టి కాల్పులు జరిపారు. మెయితీల ఆధిపత్యం ఉన్న ఇంఫాల్ ఈస్ట్ జిల్లాకు, గిరిజన మెజారిటీ ఉన్న కాంగ్పోక్తి  జిల్లాకు సరిహద్దు వెంబడి ఖమెలాక్ ప్రాంతం ఉంది. ప్రస్తుతం మణిపూర్‌లోని 16 జిల్లాలకు11 జిల్లాలలో కర్ఫూ అమలులో ఉంది. కొన్ని చోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఇళ్లపై దారుణంగా దాడులు చేస్తున్నారు. ఎక్కడ చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మణిపూర్ సీఎం బైరెన్‌ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో  జరుగుతున్న హింసపై పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేసి అమిత్‌షాకి పంపుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 349 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆందోళకారులు 4,537 ఆయుధాలను దొంగిలించారు. వీటిలో 990 ఆయుధాలను పోలీసులు రికవర్ చేసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామన్నారు.