తొలకరి వర్షాల కోసం ఎదురు చూపులు..

తొలకరి వర్షాల కోసం ఎదురు చూపులు..
  • కరుణించని వరుణుడు..
  • విత్తనాలు విత్తేందుకు సిద్ధమైన దుక్కులు..
  • దంచి కొడుతున్న ఎండలు..
  • ఆందోళన చెందుతున్న రైతులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:
 ఎప్పుడెప్పుడా అని తొలకరి వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు రైతులు దుక్కులను సిద్ధం చేసుకున్నారు. ఓ వైపు ఇంకా ఎండలు దంచి కొడుతున్నాయి. వరుణుడి కరుణ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు దాటినా తొలకరి పలకరించకడంతో వేసవి తాపానికి ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా రాలక పోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. 

వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నుండి ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ, మండుతున్న ఎండలు చూస్తుంటే ఇప్పట్లో వర్షాలు కురిసే పరిస్థితి కనబడడం లేదు. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభం అయ్యింది. సాధారణంగా ఈ కార్తె నుంచే వర్షాలు ప్రారంభం అవుతాయి. కానీ జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ ఎండల తాకిడికి జనం విలవిల్లాడిపోతున్నారు. వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందా, ఎప్పుడు వర్షాలు కురుస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా ఈ సమయంలో సాధారణానికి మించి వర్షాలు పడితే రైతులు విత్తనాలు విత్తుకుంటూ వ్యవసాయ పనుల్లో బిజీగా గడివాళ్లు. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

దుక్కులు దున్ని దిక్కులు చూస్తున్న రైతులు..

జిల్లాలోని రైతులు దుక్కులు దున్నుకొని దిక్కులు చూస్తున్నారు. విత్తనాలు విత్తే సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే పలు రకాల విత్తనాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుకున్నారు. వర్షాలు కురిస్తే విత్తనాలు విత్తేందుకు సన్నద్ధమయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వరితో పాటు పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేయాలని రైతులు భావిస్తున్నారు. ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పత్తి సాగు చేసే రైతులు ఇప్పటికే దక్కులు దున్ని, అచ్చు కొట్టి, తొలకరి జల్లులు కురిసిన వెంటనే  విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గత ఏడాది ఈ సమయానికి తొలకరి పలకరించినా ఈ ఏడాది ఇంతవరకు వర్షాలు కురియక పోవడంతో పలు చెరువులు, కుంటల్లో కూడా నీళ్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా జూన్‌ మాసం నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. జూలై, ఆగస్టు మాసాల్లో అత్యధికంగా కురుస్తాయి. జూన్‌లో కనీసం సాధారణ వర్షపాతమైనా నమోదైతే చాలు రైతులు పంటలను వేస్తారు. భారీ వర్షాలు కురిసే నాటికి పెరిగిన పంటలు దెబ్బతినకుండా ఉంటాయి. వర్షాలు ఆలస్యంగా కురిస్తే పంట దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతుంటారు. ఈ పరిస్థితుల్లో తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఎప్పటి లాగే ప్రకృతి కరుణించాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని రైతులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.