ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పి.వి. నరసింహారావు హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పి.వి. నరసింహారావు  హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముద్ర, ముషీరాబాద్: ఆర్థిక సంస్కరణలకు పితామహుడు మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు అని హరియణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు, గొప్ప రాజనీతిజ్ఞులు, మంచి సాహితీవేత్త, మృదు స్వభావి పివి అని కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు జయంతిని పురస్కరించుకొని హరియణా రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పివి చిత్రపటానికి  గవర్నర్ బండారు దత్తాత్రేయ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన పి.వి. నరసింహారావు దేశ అత్యున్నత పదవి అయిన ప్రధాని పీఠాన్ని అధిష్టించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి గందరగోళంలో ఉన్నప్పుడు ప్రధానిగా నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని సోషలిజం ముసుగు నుండి తప్పించారన్నారు. ఆర్థిక ప్రగతిని సాధిస్తూ ఆర్థిక సంస్కరణలకు పితామహుడు అయ్యాడని చెప్పారు.

సంపదను సృష్టించి అభివృద్ధికి బాటలు వేసి బడుగు బలహీన వర్గాలు, రైతుల జీవితాలలో వెలుగులు నింపారన్నారు. వారు ప్రారంభించిన సంస్కరణలనే ప్రధానులు అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్ లు కొనసాగించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంస్కరణలను మరింత వేగవంతం చేసి పెరుగుతున్న సంపదను పేద ప్రజలకు రైతులకు అందిస్తున్నారన్నారు. తాను పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు ఐడిపిఎల్, రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ మూతపడుతున్న సమయంలో వారి దృష్టికి తీసుకెళ్లగా వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టారని చెప్పారు. నిరాడంబర జీవి, రాజకీయ సామాజిక విషయాల్లో లోతైనటువంటి జ్ఞాని పి.వి అని అన్నారు. వారు చేపట్టిన సంస్కరణలను కొనసాగిస్తూ అభివృద్ధిని దేశ హితాన్ని పెంపొందింపచేసుకోవడంతోపాటు బడుగు బలహీనవర్గాలకు సేవలందించే దిశగా పయనించడమే పి.వి. నరసింహారావుకు మన మందించే నిజమైన నివాళి అని చెప్పారు.