అటు నడక... ఇటు చెత్త సేకరణ..

అటు నడక... ఇటు చెత్త సేకరణ..

  • సిద్దిపేట మున్సిపాలిటీ వార్డుల్లో కొనసాగుతున్న చెత్త సేకరణ 
  • కౌన్సిలర్లను ప్రజలకు దగ్గర చేస్తున్న "నడుస్తూ చెత్తను వేరు చేద్దాం" కొత్త కార్యక్రమం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: తెల్లవారుజామునే వార్డు కౌన్సిలర్ ఇంటి ముందర కనిపించి బాగున్నావే అని ఆత్మీయ పలకరింపులు.. సారు చెత్తను బయట వేయకమని చెప్పిండు... జర మీ ఇంట్లో చెత్తను బండికే ఇయ్యండ్రి అంటూ సుతిమెత్తగా సూచనలు ఇవ్వడం... ఇప్పుడు కాలనీలో కౌన్సిలర్ల ప్రధాన డ్యూటీ అయింది... ఈలోగా మున్సిపల్ సిబ్బంది సంచులు పట్టుకొని ఇండ్ల గోడల పక్కన,ఖాళీ స్థలాల్లో, చెట్ల కింద, మోరీల పక్కన కాలనీవాసులు పడవేసిన పొడి చెత్తను హానికర చెత్తను సేకరించి వస్తూ కౌన్సిలర్లతోపాటు వార్డు ప్రజలతో మాటలు కలుపుతూ మునిసిపల్ నియమాల గురించి తెలుపుతున్నారు. కౌన్సిలర్లు వార్డు పర్యటనలో నడుస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు స్వచ్ఛ సిద్దిపేటకు సహకరిస్తుండగా మున్సిపల్ అధికార యంత్రాంగం చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దుతోంది. శుక్రవారం నాడు సిద్దిపేట పట్టణంలోని 15,22 వార్డుల్లో ఓపెన్ ప్లాట్లలో ఉన్న చెత్తను వేరు వేశారు.

హరిత శుక్రవారం మొక్కల సంరక్షణ

సిద్దిపేట మున్సిపల్ పరిధిలో మొక్కల పరిరక్షణ కోసం ప్రతి శుక్రవారం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నాడు 15 వవార్డులో, 22 వార్డులో  మున్సిపల్  కమిషనర్ సంపత్ కుమార్, మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటికనకరాజు, వార్డు కౌన్సిలర్ పాతురి సులోచన శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల అరవింద్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మొక్కలకు నీరు పట్టారు.వార్డులో వర్షానికి నిలిచిన నీటిని జెసిబి ద్వారా కాలువలు తవ్వి తొలగించారు.  అనంతరం డి ఆర్ సి సి కేంద్రాన్ని పరిశీలించారు.