కందనూల్ లో వంశీ జోక్యంపై బగ్గు మంటున్న నాగం అనుచరులు

కందనూల్ లో వంశీ జోక్యంపై బగ్గు మంటున్న నాగం అనుచరులు

వర్గ పోరుపై సామాజిక మాధ్యమాలలో ఆగ్రహం            

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కొందరు నేతలతో కలిసి నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చీల్చే విధంగా ఉందని పలువురు నాగం అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తిరుగులేని కోటగా ఉన్న నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మొదలైందని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీ పిలుపులతో పాటు ముఖ్య నేతలంతా నాగం జనార్దన్ రెడ్డి నివాస గృహంలో సమావేశం అవుతూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఇంట్లో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుండి పాత్రికేయ సమావేశాలు నిర్వహించడంతోపాటు కార్యక్రమాలు నిర్వహించడంతో నాగం అనుచరులలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. గత ఆరు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక పర్యాయాలు మంత్రిగా ఉమ్మడి జిల్లాలో విస్తృత సేవలు అందించి తిరుగులేని నేతగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డిని దెబ్బతీసేందుకే వంశీకృష్ణ కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతున్నారని ఒకవైపు మండిపడుతూనే మరోవైపు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పట్టు ఉన్న నాగం జనార్దన్ రెడ్డి మీ నియోజకవర్గంలో కాలు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని వంశీకృష్ణను పరోక్షంగా హెచ్చరించారు.

ఇటీవల రాష్ట్ర కమిటీ పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు నియోజకవర్గం లోని మండలాలలో సామాజిక న్యాయం పాటిస్తూ కమిటీలను ఎన్నిక చేస్తే గతంలో అధ్యక్షులుగా ఉన్న కొందరు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లి వంశీకృష్ణ తో పాటు పలువురు నేతలను ఆశ్రయించి నాగంపై తిరుగుబాటు జెండాను ఎగురవేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారని ఇలాంటి పరిణామాలు రాబోయే ఎన్నికలలో పార్టీని తీవ్ర ఇబ్బందులకు నెట్టి వేయడం జరుగుతుందని దురుద్దేశపూర్వకంగానే ఒక రాష్ట్ర స్థాయి నేతతో పాటు జిల్లా అధ్యక్షులు కొందరికి వంటపాడుతూ నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నారని రాబోయే రోజులలో వాటిని సహించేది లేదని నాగం అనుచరులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నాగం కు కనీస సమాచారం లేకుండానే జిల్లా కార్యాలయం పేరుతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక చిన్న రూములో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అక్కడి నుండి పాత్రికేయుల సమావేశం నిర్వహించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్ర పిలుపుమేరకే కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వ్యతిరేకించి సమావేశాన్ని బహిష్కరించిన నేతలకు ఎలా పదవులు ఇస్తారని నాగం జనార్దన్ రెడ్డి ప్రకటించారు దీంతో రాబోయే ఎన్నికల నాటికి నేతల మధ్య విభేదం మరింత ముదిరే ప్రమాదం ఉంది కానీ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఇటీవల జరిగిన పాత్రికేయుల సమావేశంలో తాను వైద్యుడునని ఏ రోగానికి ఎలా వైద్యం చేయాలో తనకు తెలుసని ఎవరికి సర్జరీ చేస్తే బతుకుతాడో కూడా తెలుసని మరో ఐదు నెలల్లో ఎన్నికలు ఉన్నందున తాను తన బుద్ధి బలంతో ప్రజల మద్దతుతో ఎన్నికల్లో నిలబడి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేయడంతో జిల్లా రాజకీయాలలో చర్చ సాగుతుంది. తనకు ఇలాంటి పదవులపై అత్యాశ లేదని ఈ ప్రాంతానికి దక్కవలసిన నీటి వాటాను ఇతర ప్రాంతాల వారు తరలించుకుపోతున్న నేతలు చూస్తూ ఊరుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ప్రాంత ప్రజల మౌలిక హక్కుల సాధన కోసం తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు