జర్నలిస్టుల సమస్యకు పరిష్కారం

జర్నలిస్టుల సమస్యకు పరిష్కారం
  • మీడియా అకాడమీ ఛైర్మెన్ కు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్, (ఫిబ్రవరి 28) :తెలంగాణాలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని నాగర్ కర్నూల్ జిల్లా జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ గా ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి నియమితులైన సందర్భంగా నాగర్ కర్నూల్ జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన జర్నలిస్టులు కేకు కట్ చేసి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ సుదీర్ఘ జర్నలిజం అనుభవం ఉన్న శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ గా నియమితులవ్వడం హర్షించదగిన విషయమన్నారు. క్షేత్ర స్థాయి నుంచి జర్నలిస్టుల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడన్నారు. శ్రీనివాస్ రెడ్డి హయాంలో ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఓపీతో సహా పనిచేసే విధంగా హెల్త్ కార్డులు అందజేయాలన్నారు. ఇండ్ల స్థలాలు, ఇండ్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రామకృష్ణ, హకీమ్ కిషోర్, మొహమ్మద్ దర్వేష్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు కొండ కింది మాధవ రెడ్డి, జిల్లా నాయకులు అవుట వెంకటస్వామి, సుదర్శన్, పి.వెంకటస్వామి, దశరథం, విజేందర్ రెడ్డి, విజయ భాస్కర్, బంగారయ్య, జి.శంకర్, కొండమోని భాస్కర్, సాంబశివుడు, వెంకటేష్,  రైతుసంఘం జిల్లా నాయకుడు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.