తెలంగాణకు అపర భగీరథుడు సీఎం కేసీఆర్- హరీష్ రావు

తెలంగాణకు అపర భగీరథుడు సీఎం కేసీఆర్- హరీష్ రావు

నంగునూరు, ముద్ర: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామములో గురువారం రాత్రి చెరువుల పండుగ జరిగింది.చెరువు పండుగకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హాజరైనారు. పెద్ద చెరువులో గంగమ్మకు జలహారతి పట్టి, మైసమ్మకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.గంగపుత్రులు వలలతో, మహిళలు బతుకమ్మలు, బోనాలు, గ్రామస్తులు మంగళ హారతులతో మంత్రి కి ఘనంగా స్వాగతం పలికారు. రాజగోపాల్ పేట చెరువు పండుగ ఉత్సవంలో మంత్రితో కలిసి మహారాష్ట్ర రైతులు,అక్కడ సర్పంచుల సంఘం అధ్యక్షులు దత్త కాంగడే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూమహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారు బీజేపీ ప్రభుత్వ హయాంలో 8 రోజులకు ఒక్కసారి తాగునీరు వస్తున్నాయని, కేంద్ర బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారులో తాగడానికి నీళ్లు లేవని విమర్శించారు.మండుటెండలో నిండు కుండలా మన రాజగోపాల్ పేట పెద్ద చెరువు నిండి ఉన్నదని, రోహిణిలో రొకళ్ళు పగిలే ఎండాకాలంలో కూడ నిండు కుండలాగా అలుగు పారుతున్న చెరువు చూసి సంతోషం వ్యక్తం చేశారు.తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు దాటి పదవ యేటా అడుగు పెడుతున్న సందర్భంగా ఈ చెరువు పండగ జరుపుకుంటున్నామని మంత్రి  తెలిపారు. 

దశాబ్దాల కాలంగా చెరువులకు పట్టిన చిలుము వదిలించిన నాయకుడు మన సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. పెద్ద చెరువులో నీళ్లు ఉంటే ఈ ప్రాంతంలో నీళ్ల కరువు ఉండదని తెలిసి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి నాడు నీళ్ల కోసం అందరూ నిరసన దీక్ష చేశారని గుర్తు చేశారు. 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో మన కష్టాలు తీరలేదని, కేసీఆర్ 11 రోజులు దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని గత ఉద్యమ కాల జ్ఞాపకాలను గుర్తు చేశారు.  తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పట్టు పట్టి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమంలో చెరువులు పునరుద్ధరణ చేయించి నీళ్లు తెచ్చారని, కానీ, గతంలో వరుణ దేవుడి కోసం కప్ప తల్లి ఆటలు, శివాలయంలో అభిషేకాలు చేసిన నీళ్లు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మన నీళ్ల కష్టాలు తీర్చిన మన దేవుడు సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. 
రాజగోపాల్ పేట బెస్త వాళ్లు తమ చేపలు చనిపోతున్నాయని పేట చెరువులో బోర్లు వేయాలని తానూ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోరిన సంగతి,తానూ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్న ఈ చెరువులో బోర్లు వేసేందుకు అప్పులు చేసి వేయించిన సంగతి మంత్రి గ్రామస్తుల కు గుర్తు చేశారు.

గతంలో మనం ఉగాది పండుగ పంచాంగం విని వ్యవసాయం చేసేవారని,కానీ నేడు ఆ పరిస్థితి లేదని కాలమైనా కాకపోయినా రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయని రైతులు ధీమాగా ఉన్నారని వివరించారు. తెలంగాణ రాక ముందు ఇతర రాష్ట్రాల నుంచి చేపలు తెచ్చి అధిక ధరలకు అమ్మేవారని, కానీ ఇవాళ సీన్ రివర్స్ అయ్యిందని, మన రాష్ట్ర చేపలు ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్, బెంగాల్ లకు ఎగుమతి అవుతున్నాయని మంత్రి వెల్లడించారు. గతంలో చెరువులో నీళ్లు లేక నోళ్ళు తెరిచిన పరిస్థితి. ఇప్పుడు నిండు కుండలా ఉన్న చెరువు ఊరికే బతుకుదెరువు అయ్యాయనిఆయనచెప్పారు.మన తెలంగాణ రాష్ట్ర పథకాలు నకలు కొట్టి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి దేశంలో అమలు చేస్తున్నదనివిమర్శించారు.మన రాష్ట్ర పథకాలకు ఢిల్లీలో ప్రయిజ్ ఇచ్చి గల్లీలో  తిట్టి పోతున్నారని, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం పైసలు ఇస్తలేరు.కానీ మన పథకాలు నకలు కొడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఒకడు, గాంధీ భవన్ లో ఒకడు కూర్చొని కాళేశ్వరం లేదు. నీళ్లు లేవని టీవీల్లో చెప్పేటోళ్లను తెచ్చి మన పేట చెరువులో ముంచితే తెలుస్తదని మంత్రి వాస్తవం తెలుస్త తుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే రాష్ట్రంలో ఇంత పంట ఎలా పండిందో కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్ట పగలు కూడా కరెంట్ ఉండేది కాదని మంత్రి విమర్శించారు. 
మన తెలంగాణ రాష్ట్రం అన్నీ విధాలుగా అన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అత్త-కోడళ్ల  పంచాయితీ కేసీఆర్ వచ్చాక తగ్గాయని, ఇందుకు కారణం సంక్షేమం రూపంలో ఆసరా పింఛన్లు రావడమే కారణమని ధీమాగా చెప్పారు. తెలంగాణలో విద్య, వైద్యం ఇతర రంగాల్లో జరిగిన అభివృద్ధి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కనబడటం లేదా అంటూ మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు.
చాలా మందికి ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయా..? మేము బతికి ఉండగా చూస్తామా  అన్నారని, కోనసీమను టీవీలో చూసి పచ్చటి పొలాలు చూసి ఒకప్పుడు మనం బాధపడే వాళ్లమని, తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రం కోనసీమను మించి పోయామని స్పష్టం చేశారు.

కరోనా సమస్యతో రెండేళ్లు పోయాయని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం ఏడేండ్లలో సాధ్యమైందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల కాంగ్రెస్ , బిజెపీ నాయకుల మాటలు నమ్మొద్దని, ఆగం కావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర సర్పంచ్ లు, రైతులు 60 ఏళ్లలో కానీ అభివృద్ధి మీ దగ్గర ఎలా సాధ్యమైందని చూసేందుకు వచ్చారని, మహారాష్ట్రలో పెద్ద నగరాలు ఉన్నప్పటికీ, జీడీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కలలు కనే కేసీఆర్ లాంటి నాయకుడు లేరని, అందుకే మీరు అభివృద్ధి చెందడం లేదని తేల్చి చెప్పారు. మా నాయకుడు కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలు కూడా అమలు చేశారని, మా నాయకుడు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సభలో మూడేళ్లలో ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇస్తామని చెప్పారని, లేదంటే ఓట్లు అడగమని చెప్పి మూడేండ్లలో ఇంటింటికీ తాగునీరు అందించారని, అమలు చేశారని తెలిపారు.

బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారులో వారానికోసారి తాగునీరు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ తాగునీళ్ల కోసం కడప దాటదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి మీ కేసీఆర్ దేశ్ కీ నేత అంటున్నారని, పక్క రాష్ట్ర నాయకులు మనల్ని అడుగుతున్నారని, మీ కేసీఆర్ ని దేశానికి ఇవ్వండి. మీరు దారిలో పడ్డారని అడుగుతున్నారని వివరించారు. ఏదేమైనా మీరంతా సద్ది తిన్న రేవు తలవాలని, మన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.

మహారాష్ట్ర సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు దత్త కాగ్డే మాట్లాడుతూ..
ఇక్కడ జరిగిన అభివృద్ధి చూడడానికి వచ్చామని, తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు మా రాష్ట్రం నుంచే వస్తున్నాయని, కానీ మా దగ్గర జరగని అభివృద్ధి మీ దగ్గర జరగడం చూసి నేత హో కేసీఆర్ కే జైసా అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్రలో ఉన్న పాండురంగ విఠల్ దేవుడు.మీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూపంలో దేవుడిగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి చేసేందుకు వస్తే సీఎం కేసీఆర్ రెండు గంటల సమయం ఇచ్చి తమతో మాట్లాడారని, తెలంగాణ అభివృద్ధి గురించి మీరే స్వయంగా వెళ్లి మీ కళ్లతో చూడాలని పంపినట్లు మహారాష్ట్ర సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు దత్త కాగ్డే చెప్పారు.  కేవలం ఏడేండ్లలో ఇంత అభివృద్ధి ఏలా సాధ్యమైందని క్షేత్రస్థాయిలో వీక్షించేందుకు వచ్చామని, ఇలాంటి ఒక గొప్ప అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడడం సంతోషంగా ఉన్నదని, మళ్ళీ వచ్చేటప్పుడు మహారాష్ట్రలోని 200 మంది సర్పంచ్ లను తీసుకు వస్తానని మాట ఇచ్చారు.

రాజగోపాల్ పేట గ్రామ సర్పంచ్ ఏల రాజేంద్ర మాట్లాడుతూ..
తాను మహారాష్ట్రలో ఉండే వాడినని.ఇది మా స్వంతం గ్రామం కావడం వల్ల ఇక్కడ పోటీ చేసి మంత్రి ఆశీర్వాదంతో గెలిచానని తెలిపారు. 
తాను గెలిచిన తర్వాత మొట్ట మొదటి బతుకమ్మ పండుగకు నీళ్లు లేక గుంత తవ్వి అందులో రెండు బావులలో నీళ్లు మోటర్లతో పోశామని నాటి పరిస్థితి గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ చెరువు అలుగు పారే పరిస్థితి చూస్తున్నామని సంబురంగా చెప్పారు.