ఒంగోలులో ఉద్రిక్తత.. ఘోరంగా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు సమతానగర్ వైకాపా ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోడలు కావ్యారెడ్డి, వాలంటీరు సుజన ప్రియ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీరు పాల్గొనడంపై తెదేపా కార్యకర్త ప్రభావతి నిలదీశారు. దీంతో ప్రభావతి, ఆమె పిల్లలపై వైకాపా నేతలు రామానాయుడు, కృష్ణరెడ్డి, బిన్నీ స్థానిక కార్పొరేటర్ భర్త తిరుపతిరావులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న తెదేపా నేత మేడికొండ మోహన్ ఇతర కార్యకర్తలతో కలిసి ప్రభావతిని పరామర్శించడానికి అక్కడికి వెళ్లారు. ఆయనను అడ్డగించిన వైకాపా కార్యకర్తలు దాడి చేశారు.ఈ ఘటనలో మోహనక్కు గాయాలు అయ్యాయి.

విషయం తెలుసున్న తెదేపా నేత జనార్దన్, ఇతర నాయకులు ఘటనాస్థలికి వెళ్లారు. ప్రభావతి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు దామచర్ల జనార్దన్, జనసేన నాయకులు వెళ్లారు. ఈ దాడిలో గాయపడిన వారిని జనార్దన్ జిల్లా ఆసుపత్రి రిమ్స్క తరలించారు. వాలంటీర్ సుజన ప్రియను పరామర్శించేందుకు జిల్లా ఆసుపత్రికి బాలినేని రాగా, తెదేపా కార్యకర్తలను పరామర్శించేందుకు జనార్దన్, ఇతర నేతలు అక్కడికి వెళ్లారు. ఒకరికి ఒకరు ఎదురు పడడంతో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.