కరీంనగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

కరీంనగర్ లో ఘోర అగ్ని ప్రమాదం
  • దగ్ధమైన  ఇల్లు, పేలిన సిలిండర్లు
  • భయం గుప్పెట్లో  పరిసర ప్రాంత ప్రజలు
  • భారీగా  ఆస్తి నష్టం

 ముద్ర ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  సుమారు 10 పూరి ఇళ్ల వరకు దగ్ధమయ్యాయి. సిలిండర్లు పేలిపోవడం తో మంటలు ధావనం లా వ్యాపించాయి. దీంతో   పరిసర ప్రాంత ప్రజలు ఏమి చేయాలో తెలియక దిక్కు తోచని  స్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. మంటలు ఎగసిపడుతున్న క్రమంలో స్థానికులు  ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని  అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.

అగ్ని ప్రమాదానికి గల కారణాల పై పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం సంఘటన స్థలంలోనే మకాం వేశారు. జరిగిన ఆస్తి నష్టం పై పంచనామా చేశారు. కాగా, ఆ గుడిసెల్లో నివసించే కార్మికులంతా మేడారం జాతరకు కుటుంబసమేతంగా తరలి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి గత 20 ఏళ్లుగా కార్మికులు ఆ పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 తక్షణ సహాయం కింద ముడి సరుకులు బస ఏర్పాటు చేస్తాం: ఎంపీ బండి సంజయ్


 ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం, ముడి సరుకులు, స్థానికంగా బస ఏర్పాటు చేయాలని బిజెపి శ్రేణులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం తో పాటు ఇల్లు వెంటనే కట్టి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 ఇల్లు, లక్ష రూపాయలు తక్షణమే అందివ్వాలి: ఎమ్మెల్యే గంగుల


 అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత  కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం కింద  రూపాయలు, ఉండేందుకు ఇంటిని వెంటనే ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరం అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు త్వరలో తెలియపరుస్తారని వెల్లడించారు.

 బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది: పురుమళ్ళ శ్రీనివాస్ కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్

 దురదృష్టవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత  కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం పై పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేపట్టి వివరాలు తెలియపరుస్తారని  పేర్కొన్నారు. బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం కింద ముడి సరుకులు, స్థానికంగా బస ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.