మళ్లీ సత్తా చాటుతా..  జట్టులోకి వస్తా  ...

 మళ్లీ సత్తా చాటుతా..  జట్టులోకి వస్తా  ...

  • టీమిండియా ఆటగాడు హనుమ వహారి

ముంబై :  టీమిండియా టెస్టు జట్టు ఆటగాడు, తెలుగు తేజం హనుమ విహారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ పర్యటనకు సెలక్టర్లు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హనుమ విహారి మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో అర్ధం కావడం లేదన్నాడు.  గత ఏడాది జూలైలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు ఆడిన తర్వాత విహారిని సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. దీంతో అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 16 టెస్టుల్లో 28 ఇన్నింగ్స్‌లు ఆడిన విహారి 839 పరుగులు చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో రాణించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో విహారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకు అవకాశం వచ్చిన ప్రతీసారి జట్టు విజయం కోసం కృషి చేశానని.. బహుశా ఆ ప్రదర్శన సరిపోలేదని సెలక్టర్లు భావించి ఉంటారేమోనని విహారి వాపోయాడు. తనను జట్టు నుంచి ఎందుకు తొలగించారో ఎవరూ చెప్పలేదని తెలిపాడు. అయితే ఆ అంశం గురించి తాను దిగులు చెందడం లేదని.. తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టానని పేర్కొన్నాడు. 

రహానె తరహాలో సత్తా చాటి మళ్లీ జట్టులోకి రావడమే తన ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని విహారి చెప్పాడు.  తనకు టెస్టులు మాత్రమే కాకుండా అన్ని రకాల ఫార్మాట్లలోనూ ఆడాలని ఉందని విహారి అన్నాడు. ఐపీఎల్‌లోనూ ఆడే సత్తా తనలో ఉందని తెలిపాడు. తాను నెమ్మదిగానే ఆడతాననే దురభిప్రాయం చాలా మందికి ఉందని.. టెస్ట్ క్రికెట్ చాలా భిన్నమైనది కావడంతో పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుందని విహారి అభిప్రాయపడ్డాడు. తన వయసు 29 ఏళ్లేనని.. కానీ 35 ఏళ్ల వయసులోనూ రహానె రాణిస్తున్న సంగతిని విహారి గుర్తుచేశాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ధాటిగా ఆడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి బ్యాటింగ్ వేగంగా చేసినట్లు వివరించాడు. కాగా జాతీయ జట్టులో స్థానం కోల్పోవడంతో ఇటీవల ఐపీఎల్‌లో హనుమ విహారి జియో సినిమాలో కామెంటేటర్‌గా కనిపించి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా విహారి కామెంటేటర్‌గా అవతారం ఎత్తడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.