కేటీపీపీలో బయటపడుతున్న ఇంటిదొంగలు..

కేటీపీపీలో బయటపడుతున్న ఇంటిదొంగలు..
  • విలువైన సామాగ్రి మాయంపై కొనసాగుతున్న విచారణ..
  • ఇప్పటికే ఇద్దరు రిమాండ్ కు తరలింపు..
  • ఇది ఇంటిదొంగల పనేనా అని ముందే చెప్పిన 'ముద్ర'..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు శివారు కేటీపీపీలో ఇంటి దొంగలు బయటపడుతున్నారు. కేటీపీపీలో సుమారు రూ.82లక్షల విలువైన సామాగ్రి మాయం కాగా జూన్ నెలలో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశగా మారిన సామాగ్రి మాయంపై జూన్ 6న 'కేటీపీపీలో సామాగ్రి మాయం.. ఇంటిదొంగల పనేనా' అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మేరకు జూన్ 7న డీఈ గణపురం పోలీస్ స్టేషన్ లో మాయమైన సామాగ్రిపై ఫిర్యాదు చేశారు. అప్పటినుండి విచారణ కొనసాగుతుంది. విచారణలో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు పంపగా, మరికొంత మంది హస్తం ఉన్నట్లు తేలడంతో విచారణ కొనసాగుతుంది. విలువైన సామాగ్రి మాయంపై ఇంటిదొంగల పనేనా అంటూ వచ్చిన 'ముద్ర' కథనం అక్షరాల నిజమైంది.

జయశంకర్ జిల్లా చెల్పూర్ శివారు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో మూడు నెలలక్రితం భారీ చోరి జరుగగా, రూ. 82లక్షల విలువైన సామాగ్రి చోరీకి గురైంది. జెన్కో డీఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి, కేటీపీపీలో పనిచేసే ఒక అధికారి, మరో షాపు నిర్వాహకున్ని ఇటీవలె పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మరి కొందరు ఇంటిదొంగలే ఉన్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. రూ.82 లక్షల విలువగల శిలా బుష్ లు, జనరేట్ టర్బైన్, ఇతర విలువైన సామాగ్రి చోరీ జరగాయి. పోలీసు విచారణలో కేటీపీపీకి సంబంధించిన కొన్ని పరికరాలు చెల్పూర్ లోని ఒక ఇంజనీరింగ్ వర్క్ షాప్ లో బయటపడ్డాయి. దీంతో షాపు యజమాని ఠాగూర్ తో పాటు అతనికి విక్రయించిన ఏడీఈ కిరణ్ లను కోర్టుకు పంపగా, ఆషాపు యజమాని ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు. ఇందులో మరికొంత మంది ఉద్యోగులు బయటపడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.