ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు..

ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు..
  • మావోలపై ప్రత్యేక నిఘా పెట్టాలి..
  • డిఐజి, రామగుండం సిపి రేమా రాజేశ్వరి..
  • భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టాలని డిఐజి, రామగుండం సిపి రెమో రాజేశ్వరి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జెన్కో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం మహారాష్ట్ర, ఛత్తీష్ గఢ్, తెలంగాణ  పోలీసు ఉన్నతాధికారుల (గడ్చిరోలి, బీజాపూర్, తెలంగాణలోని వివిధ జిల్లాల పోలీసు అధికారులు) సమన్వయ సమావేశం, అంతర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలంగాణ, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర పోలీసు అధికారులు ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా మావోయిస్టుల కదలికలు, ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని  పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరమవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో  నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్బంగా డిఐజి, రామగుండం సిపి రెమో రాజేశ్వరి మూడు రాష్ట్రాల పోలీసు అధికారులను ఉద్దేశించి  మాట్లాడుతూ త్వరలో తెలంగాణ  రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయటంతో పాటు మద్యం, డబ్బు ఇతర ఇల్లీగల్ కు సంబందించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలతో పాటు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని, అలాగే మూడు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు.

తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్ బిడబ్ల్యు వారెంట్స్ ల విషయంలో మూడు రాష్ట్రాల పోలీసులు ఒకరికొకరు సహకరించుకోవాలని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని డీఐజి, రామగుండం సిపి కోరారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్పీ పుల్లా కరుణాకర్, ములుగు ఎస్పీ గౌస్ ఆలం, కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీ కే సురేష్ కుమార్, వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి పి రవీందర్, మంచిర్యాల ఐపీఎస్ సుధీర్, ములుగు ఓఎస్డి అశోక్ కుమార్, బీజాపూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, గడ్చిరోలి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, హుజరాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ రాములు, జి రామ్మోహన్ రెడ్డి, మూడు రాష్ట్రాలకు చెందిన డీఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.