జీవితాంతం రుణపడి ఉంటా - ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జీవితాంతం రుణపడి ఉంటా - ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నా, నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నన్ను ఆశీర్వదించిన ప్రజలందరికీ పాదాభివందనం అన్నారు. నా గెలుపుకై అహర్నిశలు కృషి చేసిన బిపిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలు, అభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు.1978నుండి నియోజకవర్గంలో ఏపార్టీ గెలిచినా రాష్ట్రంలో అదే పార్టీ అధికారం చేపడుతుందని సెంటిమెంటు 40సంవత్సరాల ఆనవాయితీని మార్చి నాకు మరోమారు నియోజకవర్గ ప్రజలు అధికారం ఇచ్చారు.

నాకు మా పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచినట్లు పూర్తి ఆధారాలు ఉన్నట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ గెలుపును  స్వాగతించి ప్రజల తీర్పును గౌరవించి ఆదర్శవంతమైన పాలన అందించాలని కోరారు.  ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకొని ఆర్థిక వనరులు సమకూర్చుకొని పరిపాలన సాగించాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధికంగా వరిధాన్యం పండించి ఆదర్శంగా నిలిచాము, ఐటి పరిశ్రమలు నెలకొల్పి పరిశ్రమలు స్థాపించడంలో కెటిఆర్ కీలక భూమిక పోషించారు, కెసిఆర్ నాయకత్వంలో అనేక రంగాల్లో అభివృద్ది సాధించాము.అధికారం వచ్చిందనే అహాంకారంతో వ్యవహరిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ఎజెండాతో అలుపెరుగని ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, సీనియర్ నేతలు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెలిదె వెంకన్న, భూర్ల లతాశంకర్, మామిడాల లింగారెడ్డి, పోగుల సారంగపాణి, రాపోలు మదుసూధన్ రెడ్డి, తాళ్లపల్లి సంపత్ కుమార్, ఏనుగుల రాకేశ్ రెడ్డి, కనకం రమేష్, మందు రాజు, ఐలోని సుధాకర్, చాడ రాజకుమార్ ఎంపిపిలు, జడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.