పేర్ని నానికి కొల్లు రవీంద్ర వార్నింగ్
- చంద్రబాబు, పవన్ పై అవాకులు, చెవాకులు పేలితే పళ్లు రాలతాయ్ అన్న కొల్లు
- చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే పేటీఎం బ్యాచ్ ప్యాంట్లు తడిసిపోయాయని ఎద్దేవా
- జగన్ తో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు విముఖత చూపిస్తున్నారని వ్యాఖ్య
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై అవాకులు, చెవాకులు పేలితే పళ్లు రాలుతాయ్ అని హెచ్చరించారు. మరో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో అసైన్మెంట్ భూములకు పట్టాలిస్తామంటూ పేర్ని నాని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే సీఎం జగన్ కు, వైసీపీ పేటీఎం బ్యాచ్ కు ప్యాంట్లు తడిసిపోయాయని... మరుసటి రోజే జగన్ ఢిల్లీకి పరిగెత్తారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో జగన్ ఏం సాధించాడో చెప్పాలని అన్నారు.
రాష్ట్ర ప్రజలు టీడీపీ - జనసేన మధ్య పొత్తును కోరుకున్నారని కొల్లు రవీంద్ర చెప్పారు. వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా జగన్ తో మాట్లాడేందుకు విముఖత చూపిస్తున్నారని అన్నారు. ఫొటోలు దిగేందుకు కూడా అందరినీ బతిమాలుకోవాల్సిన పరిస్థితి వైసీపీలో ఉందని చెప్పారు. చంద్రబాబు, పవన్ పై విమర్శలు చేసే వైసీపీ నేతలకు ప్రజా క్షేత్రంలో వస్త్రాపహరణం తప్పదని అన్నారు.