మల్లన్న సాగర్ తో నిజాంసాగర్, సింగూరుకు 6 వేల క్యూసెక్కుల నీరు : అసెంబ్లీ స్పీకర్ పోచారం

మల్లన్న సాగర్ తో నిజాంసాగర్, సింగూరుకు 6 వేల క్యూసెక్కుల నీరు : అసెంబ్లీ స్పీకర్ పోచారం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మల్లన్న సాగర్ ప్రాజెక్టు తో త్వరలో నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు 6వేల క్యూసెక్కుల నీరు వస్తుందని, దీనివల్ల ఆయకట్టు కింద రెండు పంటలకు పుష్కలంగా నీరు లభిస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, బాన్సువాడ నియోజకవర్గ బీఆరెస్ నేతలతో కలిసి  సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా గుర్తించబడుతున్న కాళేశ్వరం ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, ఇది సీఎం కేసీఆర్ స్వప్నమని అన్నారు. మల్లన్న సాగర్ కుడి కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీరు కొండపోచమ్మసాగర్ కు వెళ్తుండగా ఆ నీరు ఇప్పటికే నిజాంసాగర్ లోకి వస్తున్నాయని తెలిపారు. మరో కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కుల నీరు హల్దీ వాగు ద్వారా సింగూరు, నిజాంసాగర్ లోకి వస్తాయన్నారు. దీంతో మెదక్, నర్సాపూర్, జుక్కల్, బాన్సువాడ ప్రాంతాల రైతులకు రెండుపంటలకు నీరందుతాయన్నారు.  రైతులు ఆర్ధిక పరిపుష్టిని సాధిస్తారని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి,  మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, ఖంరు, మోహన్ నాయక్ తదితరులు ఉన్నారు.