కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా  పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ పత్రాలను ఆర్డిఓకు అందజేశారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్ ఉద్దిన్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వున్న రాజేశ్వర్, తిర్మల్ రెడ్డి,  బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ కు వెళ్లిన కేసీఆర్ అక్కడ నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ దాఖలు అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డికి వచ్చారు.   అనంతరం ఇక్కడ నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగంపై జనాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా  నామినేషన్ వేసే ముందు ప్రతిసారి సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.  ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభకు వేసే(రెండు సెట్లు) నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.