రోడ్డు వెడల్పు పనుల కోసం సొంతింటిని కూల్చిన ఎమ్మెల్యే కెవిఆర్ సంచలన నిర్ణయం

రోడ్డు వెడల్పు పనుల కోసం సొంతింటిని కూల్చిన ఎమ్మెల్యే కెవిఆర్ సంచలన నిర్ణయం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : రోడ్డు వెడల్పు పనుల కోసం స్వచ్చందంగా తన సొంతింటిని కూల్చి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి సంచలనంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రజా సేవలోనూ ముందుంటున్నారు. ఎన్నికలకు ముందు తన సొంత నిధులతో నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, మందిరాల నిర్మాణాలు చేసిన ఆయన, ప్రస్తుతం అభివృద్ధి పనులకు సహకరించి తన గొప్ప మనసు చాటుకున్నారు. నియోజవర్గంలో రోడ్డు విస్తరణ కోసం ఏకంగా తన సొంత ఇంటినే కూల్చేస్తున్నారు.

దీంతో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డిపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలకు అధికారులు నోటీసులివ్వనున్నారు.

రోడ్డును విస్తరించడానికి అడ్డుగా ఉన్న వాటిలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. అలాగే రెండు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రమణారెడ్డి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కామారెడ్డి బరిలో నిలిచిన సీఎం అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించారు.

బరిలో అగ్ర నేతలు ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రచారం చేసిన రమణారెడ్డి చివరికి విజయాన్ని అందుకున్నారు. కాగా ఎన్నికల ప్రచారం సమయంలో తన సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రమణారెడ్డి మేనిఫెస్టో ప్రకటించారు. 80 ఫీట్ల రోడ్డు వెడల్పునకు ప్రస్తుతం ఇంటిని కూల్చి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.