కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం - రోడ్ షోలో కేటీఆర్  

కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం - రోడ్ షోలో కేటీఆర్  

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి లో కేసీఆర్ ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  అన్నారు.  కొడంగల్లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా అని, రేవంత్రెడ్డికి కామారెడ్డిలో మూడవ స్థానం దక్కుతుందని  బిఆర్ఎస్ నాయకులను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్న రేవంత్రెడ్డికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు.  

మంగళవారం కామారెడ్డి పట్టణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.  సిరిసిల్ల రోడ్డు నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం, జై ప్రకాష్ నారాయణ విగ్రహం, పాంచ్ చౌరస్తా, పెద్ద మసీద్ మీదుగా  ఎస్ఎన్ గార్డెన్ వరకు రోడ్ షో జరిగింది. నిజాంసాగర్ చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులకు 3 గంటల విద్యుత్తు చాలని అంటున్నారని, ఉత్తమ్ కుమారెడ్డి రైతుబంధు దుబారా అని చెప్పాడని పేర్కొన్నారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారంటే, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అనే విధంగా ఉంటుందని, కామారెడ్డి దశ తిరుగుతుందని అన్నారు. కొందరు కేసీఆర్ భూములు గుంజుకొనేందుకు వస్తున్నాడని చెబుతున్నారని, తెలంగాణ కోసం తన ప్రాణాన్ని  ఫణంగా పెట్టిన కేసీఆర్, రైతుల భూములు ఎలా గుంజుకుంటారని ప్రశ్నించారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు కేసీఆర్ అని, భారత దేశంలోనే తెలంగాణను అగ్రశ్రేణిలో తెచ్చారని, లేనిపోని పుకార్లు లేపుతున్నారని,  నియోజకవర్గంలో ఒక్క ఇంచు భూమి కూడా ఎవ్వరిదీ పోదని అన్నారు.   అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి హక్కు వారిదేనని అన్నారు.

ఐదేళ్ళలో తెలంగాణ దశ పూర్తిగా మారుతుందని, గంప గోవర్ధన్ కేబినెట్ ర్యాంకులో ఉంటారని, ఈ ప్రాంతంలో గోదావరి నీరు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కేసీఆర్ రావాలని అన్నారు. సంవత్సరంలోపే గోదావరి నీటిని  రైతులకు అందిస్తామని, గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇపిస్తామని అన్నారు. డిసెంబర్ 3 తర్వాత రూ.400లకే సిలిండర్ ఇస్తామన్నారు. తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యం అందిస్తామన్నారు. కొత్త కార్డులు కూడా ఇస్తామన్నారు. కేసీఆర్ బీమా ఇస్తున్నాం. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఉర్దు అకాడమీ చైర్మన్ ముజీబ్ ఉద్దిన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, తిర్మల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.