అన్నం పెట్టే భూమిని దక్కించు కోవటం కోసం

అన్నం పెట్టే భూమిని దక్కించు కోవటం కోసం
  • ఆఖరి శ్వాస వరకు నిలబడుతా
  • రైతు నాయకుడు రామచందర్ రావు

ముద్ర,పరకాల: అన్నం పెట్టే భూమిని ఆఖరి శ్వాస వరకు కాపాడుకోవడమే లక్ష్యంగా ఓ రైతు ముందుకు సాగుతున్నాడు.. ప్రభుత్వం తమ వద్ద నుండి భూమిని లాగేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు దీటుగా తన భూమిని కాపాడుకోవడంతోపాటు వందలాది మంది రైతుల భూములను నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రూపంలో కబళించడానికి చేస్తున్న చర్యలకు భిన్నంగా కోర్టు మెట్లు ఎక్కిన వైనం పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ,రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుయుక్తులను ఎండగడుతూ ఆ రైతు చెన్నైలోని గ్రీన్ ట్యూబునలను ఆశ్రయించాడు. అంతేకాకుండా హైకోర్టు మెట్లు ఎక్కి గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వే పనులను మూడు సంవత్సరాలుగా ఆపివేయడంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారిపోయింది.దాంతో భూములను సాగు చేసుకోవడం రైతుల పాలిట ఓ వరంగా మారిందని తోటి రైతులు అతని అండగా నిలుస్తూ కొందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అతను ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ పరకాల అసెంబ్లీ ఎన్నికల బరిలో తనతో పాటు ఆరుగురిని రంగంలో ఉంచడం రాజకీయ పార్టీలలో కలవరాన్ని కలిగించింది.ఆ రైతు శాయంపేట మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన కావడం పట్ల తోటి రైతులు బూర్గుల రామచంద్రరావు అక్కున చేర్చుకున్నారు.

రామచంద్రరావు తెలంగాణలోని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిని అనేకమార్లు కలిసి తమ భూములు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రూపంలో పోకుండా ఆపాలని చెప్పులు అరిగేలా తిరగడం నిత్యకృత్యంగా మారింది. పరకాల చుట్టూ జాతీయ రహదారి నిర్మాణం జరిగినప్పటికీ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వద్దంటూ రైతులతో అనేకమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ క్రమంలో కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నితిన్ ఘట్కరిని కలిసి తమబోడును వెల్లబోసుకున్నారు.ఎక్కడికి వెళ్లినా రైతులకు అన్యాయమే జరుగుతుండడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆ రైతు చివరికి హైకోర్టు మెట్లు ఎక్కాడు. అక్కడ రైతులకు న్యాయం జరగకపోతే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించి రైతుల భూములను పోకుండా కాపాడుతామని రైతు నాయకుడు బూర్గుల రామచంద్రరావు తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని 2 వేల ఎకరాలు పచ్చని పంట పొలాల భూములను కేంద్ర ప్రభుత్వం ఒక్క కలం పోటుతో తీసుకోవడం పట్ల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే తమ భూములను పంటలకు పనికిరావు అని రాళ్లు రప్పలు గుట్టలతో కూడి ఉందని తప్పుడు దృవ పత్రాలు తయారుచేసి లాగేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి అన్నాన్ని అందించే పచ్చని పంట పొలాలు రోడ్డు రూపంలో వెళ్లిపోవడం పట్ల తోటి రైతులు ప్రభుత్వ తీరును తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు.

4000 కుటుంబాలు ఆ భూముల పై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాయని ఆ భూములు పోయినట్లయితే వేలాది కుటుంబాలు బజార్ల పడతాయని రైతు నాయకుడు రామచందర్రావు తెలిపారు. మంచిర్యాల, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాలోని వేలాది ఎకరాల పంట పొలాల భూములు పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ పొరు బాటను ఎన్నుకున్నట్లు రామచంద్రరావు తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తమది రైతు ప్రభుత్వం అని రైతులకు న్యాయం చేస్తున్నామని మాటలు చెప్పేవారు రైతుల భూములను ఎందుకు కాపాడడం లేదని ఆయన ప్రశ్నించారు. కాటారం ,మంతిని, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్ మీదుగా ఖమ్మం వెళ్లడానికి అనేక జాతీయ రహదారులు నిర్మాణమైనయని ఆయన తెలిపారు.

వాటిలో ఒక దాన్ని గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కు వాడుకుంటే మంచిదని రామచంద్ర రావు అన్నారు.కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగపడే నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తమకు భూములు వద్దని రైతులు కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమవడం పట్ల కొంతమంది రైతులు మేధావులు ప్రజాసంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వారికి మద్దతుగా నిలిచి వారు చేస్తున్న పోరాటాలలో కలిసి రావడం తమకు సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే పరకాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినట్లు రైతు నాయకుడు రామచందర్రావు అన్నారు. చివరికి రైతులకు చెందిన భూములను కాపాడడం కోసం ఎంతకైనా పోరాడుతామని ఆయన అన్నారు.