గూగుల్ మ్యాప్ చూస్తూ  డ్రైవింగ్​  గోదావరిలో  దిగిన లారీ  

గూగుల్ మ్యాప్ చూస్తూ  డ్రైవింగ్​  గోదావరిలో  దిగిన లారీ  
  • డ్రైవర్ ను కాపాడిన ఎంపీటీసీ  శ్రీనివాస్  

ముద్ర, తెలంగాణ బ్యూరో :  గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న ఓ లారీ డ్రైవర్ గోదావరిలోకి దూసుకుపోయాడు. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఇటీవల గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కావడంతో గుడాటిపల్లి గ్రామానికి వెళ్ళవల్సిన దారులను మూసివేశారు. అయితే, రామవరం నుంచి హుస్నాబాద్ కు వెళ్ళే పాతదారిని మూసివేయలేదు. దీంతో ఓ లారీ డ్రైవర్ నేరుగా హుస్నాబాద్ కు వెళ్ళే మార్గం అనుకుని డ్యామ్ లోకి వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా అక్కడ నీళ్ళు కనిపించడంతో ఏదైనా వాగు అని భావించి, అది దాటక మళ్ళీ రోడ్డు ఉందనుకున్నాడు.  ఈ క్రమంలో ఎంత దూరం వెళ్ళినా నీళ్ళు ఎక్కువడంతో లారీ అగిపోయింది. లారీ డ్రైవర్ ఆ నీటిలో చిక్కుకుపోయాడు. లారీని గమనించిన రామవరం గ్రామస్తులు స్థానిక ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్ కి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న శ్రీనివాస్  జేసీబీ సహయంతో లారీని, డ్రైవర్ ను బయటకి  తీసుకువచ్చి  ప్రాణాపాయం నుంచి కాపాడారు.