ఏడుపాయలలో  పొలిటిక్ ​హీట్

ఏడుపాయలలో  పొలిటిక్ ​హీట్
  • మెదక్​ఎమ్మెల్యే పద్మ భర్తపై అవినీతి ఆరోపణలు
  • తప్పు చేయలేదని తడి బట్టలతో దేవేందర్​రెడ్డి ప్రమాణం
  • అంతే దీటుగా స్పందించిన అసమ్మతి నేతలు
  • వన దుర్గామాత రాజగోపురం సాక్షిగా ఆరోపణలు
  • పద్మను ఇంటికి పంపుతామని ప్రతిజ్ఞ

ముద్ర ప్రతినిధి, మెదక్:  ప్రసిద్ధ ఏడుపాయల వన దుర్గామాత ఆలయ రాజగోపురం రాజకీయ రచ్చబండగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ అసమ్మతి నేతలు తడి బట్టలతో మాటల యుద్ధానికి దిగారు. గురువారం అమ్మవారి సన్నిధిలో మంజీర నదిలో స్నానం చేసి తడి బట్టలతో ప్రతిజ్ఞ చేశారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు అవాస్తవమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని ఇఫ్కో డైరెక్టర్, బీఆర్ఎస్ లీడర్​ఎం.దేవేందర్ రెడ్డి ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో తడి బట్టలతో ఖండించారు. ఉదయం 8 గంటలకు కొంతమంది అసమ్మతి నేతలు చేసిన ఆరోపణలను సవాల్​చేస్తూ దేవేందర్ రెడ్డి  ఏడుపాయలలోని గుడికి చేరుకున్నారు. మంజీర నది చెక్ డ్యామ్ లో అందే కొండల్ రెడ్డితో కలిసి స్నానం చేసి రాజగోపురం వద్ద ప్రతిష్ఠించిన దుర్గ మాతకు పూజలు చేసి మాట్లాడారు.

అవినీతి నిరూపిస్తే రూపాయికి పది రూపాయలిస్తా..

తాను నియోజకవర్గంలో గానీ, ఏడుపాయలలో బంగారం, వెండి ఇతర అంశాల్లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. తన హాయంలో కోనాపూర్ సొసైటీని రూ.40 కోట్ల టర్నవర్ తో ప్రథమ స్థానంలో నిలిపానన్నారు. తనపై ఆరోపణలు చేస్తూ పదవిని తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించానని, ఎవరికైనా కిందిస్థాయిలో న్యాయం జరగకుంటే హైకోర్టును ఆశ్రయిస్తారన్నారు. నావల్ల రూపాయి అవినీతి జరిగితే రూ.10 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎం ఆఫీస్ వెళ్లి ఈఓ మళ్లీ ఇక్కడే ఉండేటట్లు చెప్పలేదని, ఏడుపాయల ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ ఉన్న ఈఓ కావాలని పాలకవర్గానికి సూచించానన్నారు. సెకెండ్ గ్రేడ్ ఈఓ కావాలనుకుంటే అసిస్టెంట్ కమిషనర్ కావాలని ఎందుకు అడుగుతానని ప్రశ్నించారు. ఈవో ట్రాన్స్​ఫర్ విషయంలో తనకు సంబంధం లేదని, ఏడుపాయల విషయంలో సీఎం కేసీఆర్​తనకు ఎలాంటి చివాట్లు పెట్టలేదని స్పష్టం చేశారు. గల్లీ దాటని లీడర్లకు సీఎం, సీఎం ఆఫీస్ లో జరిగే విషయాలు తెలుస్తున్నాయంటే.. దాని వెనుక కుట్ర దాగి ఉందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 

60 ఏళ్ల తర్వాత సంపాదన సమాజానికే..

వ్యక్తిగతంగా నియోజకవర్గంలో ఎవరికైనా, ఎప్పుడైనా సహాయం చేస్తానని దేవేందర్​రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 15 వేల మంది యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించామని, రామయంపేట, మెదక్ లో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆరు నెలలు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భోజన వసతి కల్పించామన్నారు. ఇంతచేసినా ఎక్కడా తాము సాయం చేశామని చెప్పుకోలేదన్నారు. ‘అమ్మవారి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. 60 ఏళ్ల వరకు సంపాదించిన ఆదాయం నా కుటుంబానికి, 60  ఏళ్ల తర్వాతి సంపాదన సమాజానికి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నానని తెలిపారు. తన పుట్టినరోజు తర్వాత తనకు వచ్చే ఆదాయంలో 80 నుంచి -90 శాతం సమాజానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు దేవేందర్ రెడ్డి వివరించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్​పర్సన్ లావణ్య రెడ్డి, రైతు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, రామాయంపేట, మెదక్ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, చంద్రపాల్, మెదక్, పాపన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు భట్టి జగపతి, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అవినీతి చాలా ఉంది: అసమ్మతి నేతలు

ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి నియోజకవర్గంలో చాలా అవినీతికి పాల్పడ్డారని అసమ్మతి నేతలు ఆరోపించారు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రమాణం చేయలేదన్నారు. ఈ సందర్భంగా అసమ్మతి నేతలు జీవన్ రావు, గంగా నరేందర్, రాజిరెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి వర్గీయులు బొజ్జా పవన్, ప్రభాకర్, గణేశ్​ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలోని మంజీర నదిలో స్నానం చేసి వన దుర్గామాతకు పూజలు చేశారు. అనంతరం రాజిరెడ్డి, జీవన్ రావు, నరేందర్, అరుణ, రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. తమ సవాల్ స్వీకరించి దేవేందర్ రెడ్డి తడి బట్టలతో మాట్లాడడం తమ నైతిక విజయమన్నారు. నియోజకవర్గంలో దేవేందర్​రెడ్డి భూ కబ్జాలు చేశారని అన్నారు. అమ్మవారి రెండు కిలోల బంగారం విషయమే మాట్లాడారు కానీ.. రూ.9 కోట్ల ఆదాయం వస్తుంటే ఏం అభివృద్ధి చేశారో చెప్పలేదన్నారు. కొనాపూర్ సొసైటీలో రూ.2 కోట్ల కుంభకోణం జరిగిందని ఎంక్వైరీ ఆఫీసర్ తేల్చారని, సభ్యులను తొలగిస్తే ఎందుకు స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. 

పద్మను ఇంటికి పంపుతాం..

తమ అనుచరులు కబ్జాలు చేస్తున్నారని ఎన్నోసార్లు చెప్పినా దేవేందర్​రెడ్డి ఎందుకు స్పందించలేదని అసమ్మతి నేతలు ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని, అవసరమైతే బీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగి.. పద్మా దేవేందర్ రెడ్డిని ఓడించి ఇంటికి పంపుతామని దుర్గమ్మ సాక్షిగా శపథం చేశారు. డైరీ పేరు మీద ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూలు చేశారని, ఆ డబ్బు ఏం చేశారని ప్రశ్నించారు. ఘనపురం, రామయంపేట మండలంలో కార్యకర్తల మీద కేసులు పెట్టించారని ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని అధినేత సీఎంకు విజ్ఞప్తి చేశారు. రెండెకరాలున్న దేవేందర్ రెడ్డి.. వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.