ప్రభుత్వ సలహాదారుడిగా షబ్బీర్ అలీ నియామకం

ప్రభుత్వ సలహాదారుడిగా షబ్బీర్ అలీ నియామకం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) సలహాదారుగా షబ్బీర్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ హోదాతో సలహాదారు పోస్టులో నియమిస్తూ  సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.  వాస్తవానికి షబ్బీర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలో నియమిస్తారనే  ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ప్రభుత్వ సలహాదారు గా నియమించారు. షబ్బీర్ అలీ నిజామాబాద్ నుంచి అసెంబ్లీకి పోటి చేసి ఓడిపోయిన విషయం విదితమే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో రెండు సార్లు మంత్రి గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన రేవంత్ రెడ్డి కేబినేట్ లోనూ మంత్రి పదవిని ఆశించగా ప్రభుత్వ సలహాదారు గా నియమించారు. ఇదిలావుండగా షబ్బీర్ కు ప్రభుత్వ సలహాదారు గా నియమించడంతో ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే అయిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి లైన్ అయ్యింది. అతిత్వరలో జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేశ్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. త్వరలోనే మరి కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే కేబినెట్లో మైనారిటీ కి మంత్రి పదవి ఇస్తే వారిలో క్రికెటర్ అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ కు అవకాశం లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.