సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు

సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు

బాన్సువాడ, ముద్ర: సోమవారం నాడు ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  సిపిఐ, ఏ ఐ టి యు సి సంయుక్త ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ సిపిఐ కార్యాలయం ముందు మేడే జెండాను నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు ఎగరవేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినం కొరకు, శ్రమకు తగ్గ వేతనం కొరకు, వెట్టి చాకిరి నుండి విముక్తి కొరకు ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. అయితే అమెరికా దేశ  పాలకులు తన సైన్యంతో కార్మికులపై కాల్పులు జరపడం మూలంగా అనేకమంది తుపాకీ తూటాలకు బలయ్యారని తెలిపారు. కార్మికుల రక్తం నుండి పుట్టిందే ఎర్రజెండా అని ఆయన తెలిపారు. ఈ వీరోచిత పోరాటం మూలంగా పాలకులు స్పందించి కార్మికులకు చట్టాలు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ పోరాటం వలన ఎనిమిది గంటల పని దినం, పిఎఫ్ ఈఎస్ఐ చట్టం, కనీస వేతనాల చట్టం, ఫ్యాక్టరీల చట్టం, పని భద్రత చట్టాలు  వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఆ రోజు  నుండి కార్మికులు మే డే ను నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరణ చేయడం తగదని విమర్శించారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను దేశంలోని బడా పెట్టుబడుదారుల కొరకు కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని  విమర్శించారు. కార్మిక వర్గం ఐకమత్యంతో కలిసి ఉద్యమించాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కన్వీనర్ డి శంకర్, భూమయ్య, గంపల సాయిలు, శివాజీ, నాగరాజు, రాములు, చెడ్డంగారి సురేష్, హనుమాన్లు,,మొగులయ్య, ధర్మం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తాడుకోల్ , బోర్లం గ్రామంలో  రాజయ్య, సంగోజ్ పేటలో అశోక్ గౌడ్ సిపిఐ జెండాను ఎగురవేశారు.