ఎన్ని ఇబ్బందులైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తాం

ఎన్ని ఇబ్బందులైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తాం
  • బీఆర్ ఎస్ ప్రభుత్వం చెరుకు రైతులను నిర్లక్ష్యం చేసింది 
  • ప్రజలు మార్పు కోరారు ప్రభుత్వ పాలనలో మార్పు చూపిస్తాం
  • ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా పేర్కొన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభింస్తామని  తీరుతామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.  జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ భాషాలతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు విలేకరులతో మాట్లాడారు. చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు.

మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాడనికి  ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని, ఆ కమిటి చెరుకు రైతులు, అధికారులతో చర్చలు జరిపిందని చెప్పారు. అంతేకాకుండా ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపిన యాజమాన్యంతో సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించి ముందడుగు వేశామని స్పష్టం చేశారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం చెరుకు రైతులను, అధికారులను లెక్కచేయకుండా నష్టపర్చిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల చెరుకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడంతో పాటు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని దీన్ని విలువ ఆధారిత పరిశ్రమగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు.  ప్రజలు ఎన్నికల్లో మార్పు కోరారని దానికనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాలనలో తప్పకుండా మార్పు చూపిస్తామన్నారు.ఈ సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి,  గిరి నాగభూషణం, శంకర్, కొత్త మోహన్, మన్సూర్, గాజంగి నందయ్య, గుంటి జగదీశ్వర్, తాటిపర్తి శోభారాణి, కె. దుర్గయ్య, మన్సూర్  తదితరులు పాల్గొన్నారు.