ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేయాలి- ముస్లిం మైనారిటీల ధర్నా.. రాస్తారోకో..

ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేయాలి- ముస్లిం మైనారిటీల ధర్నా.. రాస్తారోకో..

మెట్‌పల్లి ముద్ర: జగిత్యాల పట్టణానికి చెందిన ముస్లిం మైనారిటీ విద్యార్థినిని అకారణంగా తిట్టి అవమానించిన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేయాలని ముస్లిం మైనారిటీ కమిటీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా డిమాండ్ చేశారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ముస్లిం మైనారిటీ లు ధర్నా నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. అనంతరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ముస్లిం మైనారిటీ కమిటీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా మాట్లాడుతూ.., బస్ లో ప్రయాణిస్తున్న ఎస్ ఐ భార్యకు బస్ లో కూర్చోవడానికి స్థలం ఇవ్వలేదనే కక్షతో బస్ ను జగిత్యాల డిపో వద్ద నిలిపివేసి మహిళ అని చూడకుండా బస్ లో నుండి క్రిందికి దించి అసభ్యపదజాలంతో దూషించి కొట్టడం సిగ్గుచేటన్నారు. ఒక ఉన్నతమైన హోదాలో ఉండి ప్రజలకు న్యాయం చేయవలసిన ఎస్ఐ తన బార్య కోసం ముస్లిం మైనారిటీ విద్యార్థినిని కొట్టి తన అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఎస్ ఐ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముస్లిం మైనారిటీ మహిళ అధ్యక్షురాలు నజీమా, వివిధ మజీద్ కమిటీల నాయకులు ఉన్నారు.