ఎన్నికల కోసమే హడావిడిగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం 

ఎన్నికల కోసమే హడావిడిగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం 
  • ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట 
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలించిన నాగం 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట అని విమర్శించారు మాజీమంత్రి, కాంగ్రెస్ నేత డా.నాగం జనార్ధన్ రెడ్డి. 20శాతం కూడా పూర్తికాని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలా ప్రారంభించారని కేసీఆర్ ను నిలదీశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో కలిసి నాగం జనార్ధన్ రెడ్డి నార్లాపూర్ వద్ద ఇటీవల ప్రారంభించిన డెలివరీ సిస్టర్న్ ని పరిశీలించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు ఇంకా టెండర్లు పిలవడం కూడా పూర్తి కాలేదన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రాజెక్టు పూర్తి అయినట్లు నమ్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం తూతూమంత్రంగా రెండు, మూడు గంటలు మాత్రమే నడిపి.. పాలమూరు సస్యశ్యామలం అయిందని గొప్పలు చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఒక మోటారును ఆన్ చేస్తే పండుగ కాదని.. పంట పొలాలకు ఎత్తిపోతల నీరు అందినప్పుడే రైతన్నలకు అసలైన పండుగ అని చెప్పుకొచ్చారు.  

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఎల్లూరు వద్ద పంపు మోటార్లు పాడవడానికి అసలు కారణం.. నార్లాపూర్ వద్ద అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మించడమేనని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల విషయంలోనూ ప్రభుత్వ వైఖరిని నాగం ఎండగట్టారు. రాష్ట్రానికి 574 టీఎంసీల వాటా దక్కాల్సి ఉండగా.. 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్ ఎలా సంతకం పెట్టారని దుయ్యబట్టారు. ఒకవేళ సరైన వానలు పడకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు సాగు గోసలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వీలైనంత త్వరగా నీటిని అందించి వారి వెతలను తీర్చాలని డిమాండ్ చేశారూ.

కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజక్టు రెండు, మూడో పంప్ లు నడవడం లేదని గుర్తు చేసిన నాగం.. పంప్ లు రిపేర్ అయినట్లు చెప్పారు. ప్రాజెక్టు విషయంలో సరైన ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానికి, ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతలకు లేదని ఎండగట్టారు. తాను ఈ ప్రాజెక్టు విషయంలో గతంలో అసెంబ్లీలో పలుమార్లు మాట్లాడినట్లు గుర్తుచేసిన ఆయన...ఎవరూ తను చెప్పిన ప్రణాళికను పట్టించుకోలేదని ఫలితంగా రైతులకు నష్టం జరిగే చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్టు దిగున సాగుచేస్తున్న రైతులకు ఎన్ని రోజుల్లో నీళ్ళను విడుదల చేస్తారో చెప్పాలని నాగం డిమాండ్ చేశారు.వారితో పాటు ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, పిసిసి మెంబర్ బాలా గౌడ్, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమాజిపేట్ పాండు, నాగర్ కర్నూల్ మండల పార్టీ అధ్యక్షుడు కోటయ్య, తాడూరు మండల పార్టీ అధ్యక్షుడు ఐతొల్ లక్ష్మయ్య, తెలకపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్ రావు, బిజినపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మిద్దె రాములు, INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు........