రాజురలో  పోలీసులకు గ్రామ ప్రజల మధ్య ఘర్షణ

రాజురలో  పోలీసులకు గ్రామ ప్రజల మధ్య ఘర్షణ
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ పర్యటన లో ఉద్రిక్తత
  • రాత్రి రెండు గంటల వరకు కొనసాగిన హై డ్రామా

ఖానాపూర్, ముద్ర : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని రాజుర గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులకు గ్రామ ప్రజలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మాజీ ఎంపీపీ భర్త, బీజేపీ నాయకుడు గడ్డం రవీందర్ కు ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ వర్గీయుల మధ్య చిన్న పాటి గొడవ తీవ్ర ఉదృక్తతకు దారితీసింది. శుక్రవారం రాత్రి సమయంలో జాన్సన్నాయక్ రాజుర లో ప్రతిష్టించిన వినాయకుడి దర్శనం కోసం వెళ్లారు. అయితే గ్రామంలో రహదారి పైన ఉన్న మాజీ ఎంపీపీ భర్త కారు రోడ్డు పైన ఉండగా, అటు వైపు వెళుతున్న జాన్సన్ నాయక్ కారు తన కారుకు తగిలిందని గొడవ మొదలైంది. ఈ క్రమంలో రాజుర నుండి మందపెల్లి రహదారి నిర్మాణం విషయం గురించి జాన్సన్ ను నిలదీసేందుకు కొందరు ప్రయత్నం చేశారు. జనాలు అధికంగా గుమిగూడటంతో విషయం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ మోహన్, ఎస్ఐ లింబాద్రి సిబ్బందితో గ్రామానికి అదే రాత్రి వెళ్లారు. పోలీస్ లకు, మాజీ ఎంపీపీ భర్త రవీందర్ కు మధ్య ఘర్షణ జరిగింది. దీనితో రవీందర్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. కడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మాజీ ఎంపీ, బీజేపీ నేత రాథోడ్ రమేష్, పార్టీ కార్యకర్తలు, రాజుర ప్రజలు రాత్రి సమయంలో  ఖానాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆందోళన చేసారు. దళితుడిని చితబాదిన సీఐ పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న రవీందర్ ను వెంటనే విడిచి పెట్టాలని స్టేషన్ ముందర ఆందోళన చేశారు. రాత్రి రెండు గంటల వరుకు ఈ హై డ్రామా జరిగింది. రవీందర్ ను కుటుంబ సభ్యులకు అప్పగించిన తరువాత ఆందోళన విరమించారు.