కాంగ్రెస్ ను ముంచినోళ్లు- మనుషుల్ని చంపినోళ్లు నాయకులా?

కాంగ్రెస్ ను ముంచినోళ్లు- మనుషుల్ని చంపినోళ్లు నాయకులా?
  • బీఅరెస్ స్టీరింగ్ అసద్ చేతుల్లో - యాక్సిలేటర్ మోదీ చేతుల్లో
  • ఆర్మూర్ ఈదీ అమీన్ జీవన్ రెడ్డి
  • టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గతంలో జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులుగా కొనసాగితే నేడు పార్టీకి వెన్నుపోటు పొడిచి కార్యకర్తలను చంపి ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారని ఇది సిగ్గుచేటని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ లో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ రాజకీయ జీవితాన్ని ఇస్తే ఆ పార్టీని కాదని బిఆర్ఎస్ లో చేరి కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న, దొర గడీలో బానిస బతుకీడుస్తున్న సురేష్ రెడ్డి వంటి నేతలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 
ఇక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధనదాహానికి నందిపేట సెజ్ బలైపోయిందని, ఫలితంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన మండి పడ్డారు. దాదాపు 7 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న బీడీలను నిషేధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పేద ఆడబిడ్డల పొట్ట కొట్టాయని అన్నారు. బీఆరెస్ కారు స్టీరింగ్ అసద్ చేతిలోఉందని ఆయన ప్రతి సారి అంటారని పేర్కొంటూ  బ్రేక్, ఎక్స్ రేటర్ కేసీఆర్, మోదీ చేతిలో ఉన్నాయా? ఆయన ప్రశ్నించారు.

ఆర్మూర్ ఈడీ అమీన్ జీవన్ రెడ్డి

దక్షిణాఫ్రికా నియంత ఈడీ అమీన్ మనుషులను కోసుకుని తింటే , మనుషుల రక్తం తాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ ఈడీ అమీన్ గా మారారని ఎద్దేవా చేశారు.
ఎవరు లేఅవుట్ చేసినా జీవన్ రెడ్డి సోదరులకు కప్పం కట్టాల్సిందేనని అన్నారు.
దుబాయ్ షేక్ లకే సున్నం పెట్టి వచ్చిన ఘనుడు జీవన్ రెడ్డి అని ఆయన ఎత్తి పొడిచారు. దళారి సత్యంను చంపించింది జీవన్ రెడ్డి కాదా? అని ఆయన ప్రశ్నించారు.ప్రజలకు ఏమీ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉంటే.. రాష్ట్ర ప్రజలకు ఏమీ రావన్న విషయం గుర్తుంచుకుని కెసిఆర్ కు బై... బై...చెప్పాలని పిలుపు నిచ్చారు.నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని అరవింద్ మోసం చేశాడని, కవితకు పట్టిన గతే అరవింద్ కు పట్టేలా చేయాలని ఆయన కోరారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు,రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు,రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.
ఇక ఈ ప్రభుత్వం పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.నిజాం చక్కెర ఫ్యాక్టరీ విషయం ప్రస్తావిస్తూ
చక్కెర పరిశ్రమ ముగిసిన అధ్యాయం అయితే.. కేసీఆర్ కూడా ముగిసిన చరిత్రే అవుతుందని అన్నారు .
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తామన్నారు.