మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు - జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు - జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:మహిళలు, విద్యార్థినులను వేధించటం, మానవ అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  ప్రవీణ్ కుమార్, షీ టీం ఎస్సై సుమాంజలి, సిబ్బంది షి టీమ్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ  షీటీమ్స్ బృందాలు మహిళలు, విద్యార్థినుల భద్రత, రక్షణ కోసం పనిచేస్తున్నాయన్నారు. ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురిచేసినా, మానసికంగా, శారీరకంగా హింసించినా, సోషల్ మీడియాలో ఫోటోలను మార్చి వేధింపులకు గురిచేసినా షీ టీమ్ కు తెలపాలని కోరారు.వారి వివరాలను షిటీమ్ కు అందిస్తే  ఆకతాయిలను పట్టుకొని వారు మైనర్ గా ఉంటే కౌన్సిలింగ్, మేజర్ అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫోక్సో చట్టాల గురించి వివరించారు.బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాలల అక్రమ దత్తత లాంటివి చేయకూడదని ఇలాంటి అక్రమ రవాణాలు జరిగినట్టు  దృష్టికి వస్తే షిటీమ్ పోలీసులకు గాని, 100, 1098, 1930 కి డయల్ చేయాలని సూచించారు. షీటీం వాట్సప్  ద్వారా 8712659550 కు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హెడ్ కాన్స్టేబుల్ లింగయ్య, మహిళా కానిస్టేబుల్ రమాదేవి, రాధికా, హోంగార్డు రమాదేవి పాల్గొన్నారు