కొత్తపల్లిలో మొరం“దందా” 

కొత్తపల్లిలో మొరం“దందా” 
  • అడ్డుకున్న గ్రామస్తులు
  • స్థానిక ప్రజా ప్రతినిధి హస్తం ?

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: వ్యవసాయ భూమి చదును పేరుతో కొత్తపల్లిలో మొరం దందా సాగిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. ఈ అక్రమ మొరం రవాణా దందా వెనుక స్థానిక ఓ ప్రజా ప్రతినిధి హస్తం ఉందని ప్రచారం జరుగుతుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా.... జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారు అనుముల ఏనే సమీపంలో ఓ రైతు వ్యవసాయ భూమి చదును కోసం గ్రామపంచాయతీ అనుమతి కోరాడు. వ్యవసాయ భూమి చదును కోసం గ్రామపంచాయతీ తీర్మానం అవసరం లేదంటూనే గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చింది. గ్రామపంచాయతీ ఇచ్చిన తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి మొరం దందాకు శ్రీకారం  చుట్టాడు. శుక్రవారం రాత్రి సదరు రైతు వ్యవసాయ భూమిలో చదును చేసినట్టుగా చేసి పక్కనున్న అనుముల ఏనేకు జెసిబి పెట్టి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రాత్రంతా మట్టిని తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొందరు వార్డు సభ్యులు మొరం తరలిస్తున్న ఓ టిప్పర్ ను శనివారం ఉదయం అడ్డుకొని మట్టిని అన్ లోడ్ చేయించారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ మొరం తరలింపు వెనక ఉన్న వ్యక్తులపై, వాహనాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.