ఓటు వేసి సేవకుడిని కొనుక్కోండి: పుట్ట మధు

ఓటు వేసి సేవకుడిని కొనుక్కోండి: పుట్ట మధు

మహదేవపూర్, ముద్ర: కాంగ్రెస్ నాయకులు నోట్లతో ఓట్లు కొనుక్కుందామని వస్తున్నారని, ‘ఓటు వేసి నన్ను కొనుక్కోండి మీకు సేవకునిగా పడి ఉంటా’ అని పంకెలలో ఎన్నికల ప్రచార సభలో ప్రజలను ఉద్దేశించి మంథని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ అన్నారు. పెద్దంపేట, పంకెన, సర్వాయపేట, నీలంపల్లి వంతెనలను తాను కట్టిస్తే, మేం కట్టించామని చెప్పుకుంటున్న వారి గురించి ఆలోచించాలని అన్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయంలోకి వచ్చి ఉన్నత విద్యావంతులైన వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని పుట్ట మధు విమర్శించారు. మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువు తక్కువగా ఉన్న నేను అభివృద్ధి చేసి మీ ముందు నిలబడ్డానన్నారు. పంకెనలో కస్తూరిబాస్కూలు కోసం భూమి సేకరించి దగ్గరుండి కట్టించానని, హై స్కూల్ తో పాటు అనేక పాఠశాలలను ఇంకా అభివృద్ధి చేస్తానని అన్నారు.

అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇప్పించడంతోపాటు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా వర్తింపజేస్తామన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు, పెన్షన్ లతోపాటు ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలను ప్రజలకు అందజేయడంతో పాటు తాను కూడా సొంత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా ఉంటానన్నారు. ప్రతి సంవత్సరం పేదల పెళ్లిళ్లు చేయడంతో పాటు ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు సొంతంగా హైదరాబాదులో హాస్టల్ లో ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 3 లక్షల రూపాయలతో పాటుగా ఇంటి నిర్మాణానికి తాను సొంతంగా సహాయం చేస్తానన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఏడు గంటల కరెంటు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు 10 హెచ్పీ మోటర్లు కొనుక్కోవాల్సి వస్తుందని కేవలం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసి కుట్రలు చేస్తున్నదని అన్నారు. 2018 ఎన్నికలలో చేసిన కుట్రలే తిరిగి చేస్తూ డబ్బులు పంచి కలుద్దామనుకుంటున్నారని, మాజీ నక్సలైట్లను, కర్ర స్మగ్లర్లను రంగంలోకి దింపి ఎన్నికలలో గెలవాలనే కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. మారుమూల ప్రాంతంలో విద్యా, ఉపాధి కల్పించాలి కానీ కర్రస్మగ్లర్లుగా బతకాలనటం ఏమిటని ప్రశ్నించారు. పుట్ట మధు వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి తిరుపతి, నియోజవర్గ మహిళ అధ్యక్షురాలు కేదారి గీత స్థానిక నాయకులు పాల్గొన్నారు.