పదేళ్లు గడుస్తున్నా నెరవేరని హామీ

పదేళ్లు గడుస్తున్నా నెరవేరని హామీ

ముద్ర ప్రతినిధి,  నాగర్ కర్నూల్ : బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)  అసెంబ్లీ  నియోజకవర్గ ఇన్ చార్జి  కొత్తపల్లి కుమార్  తాడుర్ మంలోని,  ఇంద్రకల్ గ్రామంలోని గుడిసెలను పరిశీలించారు. డబుల్ బెడ్ ఇండ్ల కోసం  వేసిన పిల్లర్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2014లో  బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని,   పార్టీ అధికారంలోకి వచ్చి  దాదాపు పదేళ్లు  గడుస్తున్నా ఆ హామీ ఎందుకు నెరవేరడం లేదని  ప్రశ్నించారు.  జిల్లాల్లో  బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, జిల్లా కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ లు త్వరితగతిన పూర్తి అవుతాయి కానీ పేదల డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు మాత్రమే  నత్తనడకన నడుస్తాయని విమర్శించారు.  డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా, పేదలకు 3ఎకరాల భూపంపిణీ చేయకుండా, రైతు రుణమాఫీ సరిగ్గా అమలు చేయకుండా, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ప్రజలకు ఇచ్చిన ఒక్కహామీ కూడా నేరవేర్చకుండా - ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని నిలదీశారు. ఎంజేఆర్ ట్రస్ట్ కార్యక్రమాలకు, నాగర్ కర్నూల్ ప్రజలకు ఏం సంబంధం అని  అడిగారు.  రాష్ట్ర బడ్జెట్లో  నాగర్ కర్నూలు ప్రజలకు ఏం మేలు జరిగిందో ప్రజలకు స్పష్టంగా విడమర్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని ప్రజలు పాదయాత్రలో ఎమ్మెల్యేను అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే పోలీసులు  ప్రజల మొబైల్స్ లాక్కోవడం, అక్రమ కేసులు బనాయించడం తగదని గర్హించారు.