నయనానందకరం.. వైకుంఠ ఏకాదశి

నయనానందకరం.. వైకుంఠ ఏకాదశి
  • భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు 
  • శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, మహేశ్వరి దంపతులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు :  జిల్లా అంతటా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవైష్ణ వాలయాల్లో స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు.తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం బారులు తీరారు. నాగర్ కర్నూల్ జిల్లాలోనే అత్యంత పురాతరమైన వైష్ణ ఆలయాల్లో ఒకటైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో స్వామివారిని ప్రత్యేక వాహనంపై ఉత్తర ద్వారం నుంచి బయలుదేరి గ్రామ పురవీధుల గుండా భక్తులకు దర్శన భాగ్యాన్ని అందించారు. స్వామి ఊరేగింపు భక్తుల భజనలు, కోలాటాలతో సాగింది.

ఉదయం నుంచి ప్రారంభమైన దర్శనాలు భక్తుల రద్దీతో సాగాయి. పలు ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పారాయణాలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావించిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్, సతీమణి మహేశ్వరి, కుమారుడు ఇషాన్ అథరు  కుటుంబ సమేతంగా శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి వారి ఊరేగింపు సేవలో పాల్గొని, ఉత్తర ద్వారం దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కలెక్టర్ కుటుంబ సభ్యులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆలయ చైర్మన్ కూచుకుళ్ళ నరసింహారెడ్డి, కార్యదర్శి గంధం ప్రసాద్, అర్చకులు గ్రామ సర్పంచ్ తదితరులు పూజా కార్యక్రమంలో ఉన్నారు.అర్చకులు అభిషేకాలు అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు ఇచ్చారు.పాలెం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.