కేసీఆర్ సభను అడ్డుకుంటాం

కేసీఆర్ సభను అడ్డుకుంటాం
  • హుస్నాబాద్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న సతీష్ బాబు
  • అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఈనెల 15న  హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో  బి ఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభను అడ్డుకొని ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి ని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కీములు, స్కాములు, కేసులతో నడిపించడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిర్వహించిన ప్రతి పరీక్ష ఒకవైపు పేపర్ లీకు కావడం మరోవైపు పరీక్షలు రద్దు కావడం వల్ల రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర మనోవేదనకు గురవుతుందని విచారం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ప్రాంతం పై ఎమ్మెల్యే సతీష్ బాబు మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్  సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని దానికి నిదర్శనమే హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ,ఎమ్మెల్యే మాటలు నీటి మూటలు అయ్యాయని కోమటి చెరువు అభివృద్ధి చేసుకున్న మీరు ఎల్లమ్మ  చెరువు అభివృద్ధి కాకపోవడం నిదర్శనం కాదా! అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అయిన బీసీ బందు, గృహలక్ష్మి, మైనార్టీ బందు పలు రకాల పథకాలు 70% పైచిలుకు బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేసింది నిజం కాదా అని అన్నారు. 

హుస్నాబాద్ లో మెరుగైన వైద్యం అందించడంలో ఘోర వైఫల్యం చెందడం ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమని అన్నారు. మీ నియోజకవర్గాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రారంభమైన కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఫలాలు రైతులకు అందిస్తూ, 2007లో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నత్త నడకగా నడిచింది నిజం కాదా అని అన్నారు. ఒక్క ఎకరానికైన ఇప్పటి వరకు నీల్లు ఇచ్చారా అని అన్నారు. గత ఎన్నికలలో ముఖ్యమంత్రి  హుస్నాబాద్ కు నాకు అవినవభావ సంబంధం ఉందని సెంటిమెంటును రగిలిచ్చి ప్రజలను మభ్యపెట్టి కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నామని ఈరోజు వరకు కొత్తకొండ ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేసిన పాపాన పోలేదు. కనీసం ఒక్కసారి అయినా ముఖ్యమంత్రి గారు కొత్తకొండ ఆలయాన్ని దర్శించుకున్నారా, కొత్తకొండ ఆలయానికి 20 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి, హుస్నాబాద్ ఎల్లమ్మ గుడి లకు 10 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీ పాలనలో ఆగమైతుందని అందుకు నిదర్శనమే అంగన్వాడీలు, ఆశాలు ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ఇదేనా మీ బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో సతీష్ బాబును సాగనంపి హుస్నాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామని హుస్నాబాద్ లో జరిగే సభ ప్రజా ఆశీర్వాద సభ కాదని హుస్నాబాద్ ప్రజల గోస సభ అని అన్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారి పర్యటనను అడ్డుకొని రణరంగం సృష్టిస్తామని దానితో మా హుస్నాబాద్ ప్రజల గోస మీకు అర్థమందుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు మొలుగూరి హరికృష్ణ, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు రాగుల శ్రీనివాస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు గడిపే సుజిత్, వేముల శ్రావణ్, గూళ్ల సృజన్, మోలుగురి శ్రీమన్, బోయిని శ్రీనివాస్, బేజ్జెంకి వీరయ్య, చెరవేని ప్రదీప్ మరియు విజయ్ తదితరులు పాల్గొన్నారు.