అధికారం అడ్డుపెట్టుకొని  అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం...

అధికారం అడ్డుపెట్టుకొని  అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం...
  • వైయస్సార్ అండతో నువ్వు ఎదగలేదా వెంకట్ రెడ్డి...?
  •  సందీప్ రెడ్డి పై మాటలను ఖండించిన బిఆర్ఎస్ నేతలు

ముద్ర ప్రతినిధి భువనగిరి : రాష్ట్ర మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారం అడ్డుపెట్టుకొని  అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని  టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలు అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను  వారు ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పైఅనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అండతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు సందీప్ రెడ్డి పై దాడి చేయడం హేయమైన చర్య అన్నాడు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సంయమనం పాటించాలని లేనిపక్షంలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు సమావేశాలకు ఆహ్వానించవద్దని సూచించారు. రానున్న రోజుల్లో ఇదే పద్ధతి కొనసాగిస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

భువనగిరిలో విజయం సాధిస్తాం.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి కార్యాచరణ చేపడుతున్నామని కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజకవర్గాల వారిగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తలను సమయుక్తం చేయనున్నట్లుగా తెలిపారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ప్రశ్నించగా పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.


టిఆర్ఎస్ పార్టీకే భువనగిరి చైర్మన్ పీఠం.
రాబోయే చైర్మన్ ఎన్నికల్లో మాకు పూర్తి మెజారిటీ ఉందని టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చైర్మన్ అవుతాడని వారు స్పష్టం చేశారు. పార్టీలో స్వల్ప వివాదాలే తప్ప చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి దించడం పెద్ద విషయం కాదు అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు పూర్తి మంది పార్టీలోని కొనసాగుతున్నారని పార్టీ సూచించిన వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకుంటారని  తెలిపారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జడల అమరేందర్, కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు  పాల్గొన్నారు.