టాప్ కాలేజీగా తీర్చిదిద్దుతాం

టాప్ కాలేజీగా తీర్చిదిద్దుతాం
  • సర్పంచుల జీవితాలు దారుణంగా మారాయి
  • సర్పంచుల ఆందోళన న్యాయమైనదే
  • సర్పంచుల ఆందోళనకు మద్దతిస్తాం
  • బీఆర్ఎస్ హయాంలో సర్పంచుల ఆత్మహత్యలు
  • పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలను గెలుచుకుంటాం
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ లో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ నిర్మాణానికి సీఎస్సార్ కింద కేంద్ర నిధులు మంజూరు చేయిస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్ ఎంపీ నిధుల కింద రూ.10 లక్షలతో నిర్మించిన సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్ ను పరిశీలించారు. సోలార్ పవర్ వల్ల మంచి నీళ్లు, కరెంట్ సహా విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతోందన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

మహిళా కళాశాల విద్యార్ధినుల కోసం రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశాను. దీనివల్ల కరెంట్, మంచి నీటి ఇబ్బందులు తొలగిస్తాయి. త్వరలో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం కేంద్ర నిధులతో ప్రత్యేక హాస్టల్ నిర్మించేందుకు కృషి చేస్తా. అంతేగాదు, కరీంనగర్ మహిళా డిగ్రీ కాలేజీని టాప్ కాలేజీగా తీర్చిదిద్దేందుకు నా వంతు క్రుషి చేస్తానన్నారు.
మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యోగం కోసమే చదువుకోవాలనే ఆలోచన వద్దు. చదువు కెరీర్ తోపాటు సంస్కారం,సంస్కృతి, లక్ష్య సాధనకు ఉపయోగపడాలని    వెల్లడించారు.

సర్పంచుల పోరాటం న్యాయమైనది

సర్పంచులు వచ్చే వారం నుండి ఆందోళన చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు చూసిన. సర్పంచుల పోరాటం న్యాయమైనదే. మా పార్టీ నాయకత్వంతో మాట్లాడి సర్పంచుల పోరాటానికి మద్దతిస్తాం అని వెల్లడించారు. తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం వచ్చేనెల 1న ముగియబోతోంది. సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశానని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను, సర్పంచులకు చేసిన మోసాలను సరిదిద్దాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. లేనిపక్షంలో బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వంపై కేసు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం  కూడా బీఆర్ఎస్ మాదిరిగా నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయం. తెలంగాణలో 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం. ఐఎన్డీఐఏ కూటమి కుక్కల చింపిన విస్తరిలా మారింది. ఎన్డీఏ కూటమిలో చేరే పార్టీలకే భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణలోనూ బీజేపీలో చేరే నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ తో పాటు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.