20 కోట్లతో నిర్మించిన సి ఐ టి డి భవనం

20 కోట్లతో నిర్మించిన సి ఐ టి డి భవనం
  • ఫర్నీచర్, కంప్యూటర్లుసహా మౌలిక వసతులు సిద్ధం
  • అతి త్వరలో  కోర్సులు ప్రారంభం
  • సీఐటీడీ విస్తరణ కేంద్ర సందర్శనలో బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ లో సీఐటీడీ (సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) విస్తరణ భవన నిర్మాణం పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఈ భవన నిర్మాణం కోసం రూ.20 కోట్ల 40 లక్షలను విడుదల చేసింది. ఆయా నిధులతో భవన నిర్మాణంతోపాటు తరగతి గదులకు అవసరమైన కంప్యూటర్లు, ఫర్నీచర్ తోపాటు వర్క్ షాపుకు అవసరమైన యంత్రాలను సమకూర్చారు. కరీంనగర్ లోని ఉజ్వల పార్క్ సమీపంలోని పాత శాతవాహన యూనివర్శిటీ క్యాంపస్ స్థలంలో ఏర్పాటు చేసిన సీఐటీడీ విస్తరణ కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సందర్శించారు. కేంద్రం నిర్వాహకులతో కలిసి  భవన నిర్మాణాన్ని, తరగతి గదులను, కొత్తగా సమకూర్చిన కంప్యూటర్లు, ఫర్నీచర్ ను పరిశీలించారు. వర్క్ షాప్ గదులను సందర్శించారు. అధికారులతో సమావేశమై అడ్మిషన్లు ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారని, ఏయే కోర్సులను ప్రవేశపెడుతున్నారనే అంశంపై ఆరా తీశారు. 


అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కరీంనగర్ లో సీఐటీడీ విస్తరణ కేంద్ర ఏర్పాటు కోసం రూ.20 కోట్ల 40 లక్షలను వెచ్చించిందని చెప్పారు. భవన నిర్మాణం పూర్తి కావడంతోపాటు అన్ని సదుపాయాలను సమకూర్చిందన్నారు. అతి త్వరలోనే తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. డిగ్రీ, ఇంజనీర్, డిప్లోమా, ఐటీఐ విద్యార్థులు ఉపాధి, ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆయా కోర్సుల ద్వారా నైపుణ్యత సాధించి ఉద్యోగాల్లో చేరవచ్చన్నారు. ఆయా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అనేక సంస్థలు ప్లేస్ మెంట్ కల్పించే అవకాశాలున్నాయన్నారు.

స్వామి వివేకానందుడి సేవలు చిరస్మరణీయం

జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్  కుమార్ స్వామి వివేకానందకు పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. స్థానిక శివ థియేటర్ సమీపంలోని చౌరస్తావద్ద జరిగిన కార్యకమంలో పాల్గొన్న బండి సంజయ్ యువతీ యువకులకు యువ సేవా పురస్కార్ అవార్డులను అందజేశారు. ఆ తరువాత ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న నెహ్రూ యువజన కేంద్రం కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో మహారాష్ట్రలోని నాసిక్ నుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ యూత్ ఫెస్టివల్ ను ఉద్దేశించి ప్రసంగిస్తుండటంతో బండి సంజయ్ చాలా సేపు మోదీ ప్రసంగాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, కటకం లోకేష్, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.