ఒకే ఒక్క ఓటరు కోసం అడవిలో పోలింగ్ బూత్ !

ఒకే ఒక్క ఓటరు కోసం అడవిలో పోలింగ్ బూత్ !
 Haridasji, the lone voter of Gujarat's Banej polling booth

గుజరాత్: మన ఓటు హక్కు విలువను చాటిచెప్పే ఉదంతం ఇది. ఓ అటవీ ప్రాంతంలో కేవలం ఒకే ఒక్క ఓటరు కోసం ఎన్నికల కమిషన్ పోలింగ్ బూత్ నే ఏర్పాటు చేసింది.. గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో సింహాలు, పులులకు నిలయమైన గిర్ అభయారణ్య ప్రాంతంలో ఈ పోలింగ్ బూత్ ను అక్కడి ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ బూత్ లో ఓటేసే ఓటరు పేరు మహంత్ హరిదాస్ జీ.  ఆ అభయారణ్యంలోని బజేజ్ ప్రాంతంలో ఒక శివాలయంలో ఆయన పూజారిగా పనిచేస్తూ, అక్కడే నివసిస్తున్నారు. ఈ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ కోసం ఎన్నికల కమిషన్ అధికారులు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్టు ఒక అధికారిక ప్రకటనలో వివరించారు. సాధారణ జన జీవన స్రవంతి ఉన్న ప్రాంతాలకు సుదూరంగా బజేజ్ వుందని, ఇది గిర్ సోమనాథ్ జిల్లా పరిధిలో వుందని తెలిపారు. సుదూరమైన అటవీ ప్రాంతాలు, చిన్న దీవులు, మానవ సంచారానికి దూరంగా వున్న ఇలాంటి చోట్ల 11 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఒకే ఒక్క ఓటరున్న బజేజ్ కూడా ఒకటి. ఇటీవలే గిర్ సోమనాథ్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డిడి జడేజా బనేజ్ ప్రాంతాన్ని సందర్శించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. గిర్ సోమనాథ్ జిల్లాలోనే గిర్ అభయారణ్యంలో మరే ఇతర హేబిటేషన్ సమీపంలోని లేని సాప్ నెస్ బిల్లియా అనే చిన్న ప్రాంతంలో కూడా ఇలా ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. గుజరాత్ లోని మొత్తం 26 లోక్ సభ స్థానాలకు ఒకే దశలో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది.