పొత్తు కుదిరింది!

పొత్తు కుదిరింది!
  • కామ్రేడ్లకు చెరో రెండు స్థానాలు
  • కాంగ్రెస్ స్క్రీనింగ్ ​కమిటీ నిర్ణయం
  • కొత్తగూడెం నుంచి కూనంనేని.. ఖమ్మం నుంచి తుమ్మల
  • పాలేరు నుంచి పొంగులేటికి లైన్​క్లియర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీపీఐ, సీపీఎంలకు రెండు చొప్పున టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్​హై కమాండ్​ఒప్పుకుంది. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అగ్రనేతలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు అంశంపై రెండు నెలల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మొదటగా ఇరు పార్టీలకు ఒక్కో స్థానం కల్పించాలని కాంగ్రెస్​ప్రతిపాదనను కామ్రేడ్లు తిరస్కరించారు. దీంతో చెరో రెండు స్థానాల్లో టిక్కెట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ ఒప్పుకుంది. పొత్తులో భాగంగా.. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు, సీపీఏంకి భద్రాచలం, మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవ్వాలని కాంగ్రెస్​ నిర్ణయం తీసుకుంది. అయితే భద్రాచలంలో ఇప్పటికే అక్కడ కాంగ్రెస్​ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నప్పటికీ సీపీఏంకి ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పోదెం వీరయ్యను పినపాక నియోజకవర్గానికి పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాలేరు, ఖమ్మం నుంచి టికెట్లు కావాలని కమ్యూనిస్టులు పట్టుబట్టారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాలేరు సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్​సమ్మతించలేదు. ఇటు రాజకీయ ఉద్దండుడు, సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి బరిలో నిలవనున్నారు. దీంతో కమ్యూనిస్టులకు ఆ టికెట్టు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో కొత్తగూడెం నుంచి సీపీఐ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీకి లైన్​క్లియర్​అయింది.