మేరా భారత్ మహాన్​

మేరా భారత్ మహాన్​
  • భార‌త్‌గా మార‌నున్న ఇండియా 
  • పార్లమెంట్ ప్రత్యేక స‌మావేశాల్లో తీర్మానం? 

ముద్ర, తెలంగాణ బ్యూరో : ‘ఇండియా’ ఇక ‘భార‌త్‌’గా మార‌నుంద‌నే ప్రచారం జోరందుకుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జ‌రిగే పార్లమెంట్ స‌మావేశాల్లో ఎన్డీఏ కూటమి స‌ర్కార్ ఈ ప్రతిపాద‌న‌ను స‌భ్యుల ముందుంచ‌నుంద‌ని భావిస్తున్నది. రాజ్యాంగ సవరణ ద్వారా ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చే ప్రక్రియను కేంద్రం చేపడుతుందని, లోక్​సభ ప్రత్యేక సమావేశాల్లో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోడీ సర్కార్ పావులు కదుపుతోందని తెలిసింది. రాష్ట్రప‌తి భ‌వ‌న్ నుంచి జీ20 ప్రతినిధుల‌కు అధికారిక స‌మాచారంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్’ అని రాసిఉండ‌డం పేరు మార్పు ప్రతిపాద‌న‌కు బ‌లం చేకూరుస్తోందని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్​ట్వీట్ చేశారు. ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’అని రాయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్‌.. జీ20 ఇన్విటేష‌న్‌పై వివాదం

జీ20 దేశాల నేత‌ల‌కు విందు ఇవ్వనున్న నేప‌థ్యంలో  ఆహ్వాన ప‌త్రిక‌పై కొత్తగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్’ అని రాశారు. రాష్ట్రప‌తి ముర్ము ఇచ్చే ఆ విందు ఆహ్వాన‌ పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ‌దులుగా  ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాయ‌డం వివాదాస్పదం అవుతోంది.  జీ20 సమావేశాలకు వివిధ దేశాధినేత‌లు హాజ‌రవుతున్న స‌మ‌యంలో ఇండియాను భార‌త్‌గా గుర్తిస్తూ ఆహ్వాన పత్రికను  ప్రచురించ‌డం సంచ‌ల‌నంగా మారింది. జీ20 దేశాధినేత‌ల‌తో పాటు ముఖ్యమంత్రుల‌కు సెప్టెంబ‌ర్ 9వ తేదీన విందు రాష్ట్రపతి విందు ఇవ్వనుంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికపై  ‘ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్’ అని రాయ‌డం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. భార‌త్ అన్న ప‌దం మ‌న రాజ్యాంగంలో ఉంద‌ని అధికారులు తెలిపారు. ఇండియా లేదా భార‌త్‌, ఆర్టిక‌ల్–1 ప్రకారం యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్‌గా గుర్తిస్తారు. విదేశీ ప్రతినిధుల‌కు అంద‌జేసిన జీ20 బుక్‌లెట్‌లోనూ భార‌త్ అన్న ప‌దాన్ని వాడారు. ప్రజాస్వామ్యానికి భార‌త్‌ త‌ల్లి లాంటిద‌ని, వేల యేళ్ల నుంచి ఇక్కడ సుసంప‌న్నమైన ప్రజాస్వామ్యం వ‌ర్ధిల్లితున్నట్లు ఓ బుక్‌లెట్‌లో రాశారు.

అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ హర్షం

రాష్ట్రప‌తి డిన్నర్ ఆహ్వానపత్రిక  కార్డు లీకైన త‌ర్వాత‌  అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశ‌ర్మ హ‌ర్షం వ్యక్తం చేశారు. ‘రిప‌బ్లిక్ ఆఫ్ భార‌త్’ అని రాస్తూ.. మ‌న నాగ‌రిక‌త ముందుకు వెళ్లడం గ‌ర్వంగా ఉంద‌ని ఆయన ట్వీట్ చేశారు. ఇండియాను భార‌త్ అని పిలువాల‌ని కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ నేత మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ పిలుపునిచ్చారు. ఇటీవ‌ల విప‌క్ష పార్టీలు త‌మ కూట‌మికి ఇండియా అన్న పేరు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇండియా, భార‌త్ అంశంపై వివాదం చెల‌రేగుతూనే ఉంది.

దేశం ఎన్నటికీ భారత్ గానే ఉంటుంది : - కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

దేశం ఎన్నటికీ భారత్ గానే ఉంటుందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి విష‌యంలో స‌మ‌స్యలు క‌నిపిస్తున్నాయ‌ని ఆయన విమర్శించారు.  తాను భార‌తీయుడనని, త‌న దేశం పేరు ‘భార‌త్’ అని ఎప్పటికీ భార‌త్‌గానే ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.