పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు

పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు
  • ప్రతి నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రం
  • ఈవీఎంల తరలింపు కోసం కట్టుదిట్టమైన భద్రత
  • జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జనగామ కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య తెలిపారు. పోలింగ్‌ ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్యతో పాటు అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసినితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రచార సమయం జిల్లాలోని మూడు నియోజకవర్గల్లో నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందన్నారు. అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారులు సైలెన్స్ పీరియడ్‌లో పాటించాల్సిన నిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు సమాచారం అందించాలని, ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు వెళ్లేలా చూడాలని అన్నారు. పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు సూచించారు.

విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్ల చాయాలన్నారు. పోలింగ్ అనంతరం వీఈఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ రోజు సిబ్బంది సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని, మాక్ పోల్ నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్, పాలకుర్తి ఆర్వో రోహిత్ సింగ్, ఉప ఎన్నికల అధికారి సుహాసిని, జనగామ, స్టేషన్​ఘన్‌పూర్‌‌ రిటర్నింగ్ అధికారులు మురళీకృష్ణ, రామ్మూర్తి, ఎన్నికల నోడల్ అధికారులు ఇస్మాయిల్, వినోద్ కుమార్, అనిల్ కుమార్, ఎన్ఐసీ జేడీ రాంప్రసాద్, ఈడీఎం దుర్గారావు, ఎన్నికల తహసీల్దార్‌‌ శ్రీనివాస్ పాల్గొన్నారు.