పార్టీలు మారేవాళ్లకు డీసీసీ పగ్గాలా?

పార్టీలు మారేవాళ్లకు డీసీసీ పగ్గాలా?
  • లోకల్‌ లీడర్లకే జనగామ అధ్యక్ష పదవి ఇవ్వాలి
  • అన్ని వర్గాలకు న్యాయం చేసే ఏకైక వ్యక్తి ‘పొన్నాల’
  • లక్ష్మయ్యపై తప్పడు ప్రచారాలు మానుకోవాలి
  • టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ధర్మ సంతోష్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి రెండు వర్గాలుగా చీలిన పార్టీలో డీసీసీ పీఠం మరింత వివాదాలను కారమవుతోంది. ఇటీవల కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని జనగామ డీసీసీ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నియామకాన్ని పార్టీ సీనియర్‌‌ లీడర్లు, పొన్నాల వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో టీపీసీసీ మాజీ అధికార ప్రతిననిధి ధర్మ సంతోష్ మీడియాతో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని పార్టీ మారే వ్యక్తలకు ఇవ్వడం సరికాదన్నారు. దీనిపై హైకమాండ్‌ పునరాలోచించాలని రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి డీసీసీ బాధ్యతలు అప్పగించడాన్ని పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదన్నారు. దశాబ్దాలు పార్టీ కండువా మోస్తున్న జనగామకు చెందిన లీడర్లను వదిలి టికెట్‌ కోసం పార్టీలు మారే వారికి డీసీసీ పగ్గాలు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు తాము (పొన్నాల వర్గం) సిద్ధంగా లేమని స్పష్టంగా చెప్పారు. స్థానికంగా ఉండి పార్టీ సేవలందించిన లోకల్‌ లీడర్లు ఎవరికి డీసీసీ బాధ్యతలు ఇచ్చినా కలిసి పనిచేస్తామన్నారు.  

అందరివాడు ‘పొన్నాల’
పార్టీలో ఉన్న కొందరు లీడర్లు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్యపై అవాకులు చెవాకులు పలుకుతున్నారని ధర్మ సంతోష్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం చేసే సమర్థుడు పొన్నాల అన్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో బీసీ, ఓసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. పొన్నాల ఇచ్చి పదవులను అనుభవించిన కొందరు లీడర్లు ఇప్పుడు ఆయనపై ఆరోపణలు చేయడం.. ‘ఆకాశంపై ఉమ్మి వేయడం’ లాంటిదేనని ఎద్దేవా చేశారు. పొన్నాలను విమర్శించే లీడర్లు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు.

వెంకన్న.. మా పరిస్థితి ఏందీ..?
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపు కోసం తాము ఎంతో కష్ట పనిచేశామని, కానీ ఆయన తమను గుర్తించకపోవడం బాధకరం సంతోష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నమ్ముకుని ఉన్న తమకు ‘ఇలాంటి పరిస్థితి ఏంటీ వెంకన్న’ అని మీడియా ద్వారా వెంకట్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. కొమ్మూరికి కాకుండా పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్న ఎర్రమళ్ల సుధాకర్‌‌, కంచ రాములు,  మేడ శ్రీను లేదా ఇంకెవరికైనా డీసీసీ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ విషయంపై హైకాండ్‌ వద్దకు వెళ్తామని సంతోష్‌రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారాయణరెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు జఫర్‌‌ షరీఫ్‌, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర నాయకులు నిడిగొండ శ్రీనివాస్‌, పార్టీ జనగామ మండల అధ్యక్షుడు కొన్నె మహేందర్‌‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు యాట క్రాంతి, నాయకులు ఎండీ సర్వర్, రాజురెడ్డి, యాసిన్‌, నరేశ్‌, నిఖిల్‌, శివరాజు పాల్గొన్నారు.