15వ వార్డు జలదిగ్బంధం - ఇబ్బందుల్లో కాలనీవాసులు

15వ వార్డు జలదిగ్బంధం - ఇబ్బందుల్లో కాలనీవాసులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని 15వ వార్డు జలదిగ్బంధంలో మునిగింది. భారీ వర్షాలకు ప్రధాన రోడ్డు మీదుగా వచ్చే వరద 15వ వార్డులోని పలు ఇండ్లను, ఖాళీ ప్లాట్లను చుట్టుముట్టింది. ఇండ్ల చుట్టూ నీరు చేరడమే కాకుండా ఇళ్లలోకి నీళ్లు వచ్చి వంట సామాగ్రి, దుస్తులు, ఫర్నిచర్ తడిసిందని గద్దల ఎల్లయ్య, దండు నరసయ్య, అంగడి రవి, పొన్న వెంకటయ్య, సారయ్య, నరసయ్య, ఆనందం ఆవేదన వ్యక్తం చేశారు.

వారం రోజులుగా వర్షపు నీరు ఇళ్లలోకి వస్తుందని చెప్పిన పాలకులు పట్టించుకోకపోవడంతో గురువారం 100 డయల్ చేస్తే పోలీసులు వచ్చి వర్షపు నీరు బయటకు పంపించే మార్గాన్ని చూపించారన్నారు. అయినప్పటికీ ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు పూర్తిగా వెళ్లలేదన్నారు. ఓట్ల సమయంలో వచ్చే రాజకీయ నాయకులు ఈ వాన నీళ్లతో వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు, పాలకమండలి 15 వ వార్డు నీట మునక్కుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • ఎమ్మెల్యే, సర్పంచ్ స్పందించాలి

సింగపురం వెంకటయ్య, మాజీ ఉపసర్పంచ్  వరుస వర్షాలతో 15వ వార్డు నీట మునుగుతున్న అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. దళితవాడకు చెందిన స్థానిక ఎమ్మెల్యే, స్థానిక సర్పంచ్ లు వెంటనే స్పందించి 15 వ వార్డు నీట మునగకుండా చర్యలు తీసుకునేందుకు స్పందించాలని వెంకటయ్య డిమాండ్ చేశారు.