తిరుమలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలకు ఏర్పాట్లు  

తిరుమలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలకు ఏర్పాట్లు  

తిరుమలలో  ఈ నెల  7, 8వ తేదీల్లో జరుగనున్న శ్రీ కృష్ణజన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గురువారం రాత్రి 8 నుండి 10 గంటల నడుమ గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.   గోగర్భం డ్యామ్‌ దగ్గర ఉన్న  ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణుడుకి ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు పంచాభిషేకాలు ఘనంగా జరుగనున్నాయి. 

తరువాత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది.   8వ తేదీ శక్రవారం  తిరుమలలో ఉట్లోత్సవాన్ని మధ్యాహ్నం 4 గంటల‌ నుండి రాత్రి 8 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉట్లోత్సవాన్ని  శ్రీ మలయప్పస్వామి  బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి  మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని  8వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవలను టీటీడీ  రద్దు చేసింది.