కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు.. 

కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు.. 

నిబంధనల ప్రకారం 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు..
జిల్లా ఎన్నికల అధికారి వెల్లడి..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా కోరారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై ఎన్నికల నోడల్ అధికారులతో ఆయన శుక్రవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ డిసెంబర్ 3న ఉదయం 8 గంటలకు భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ కు ఈవీఎం యంత్రాల తరలింపు ప్రక్రియ సిసిటీవీ కెమెరాలలో రికార్డు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ప్రతి కంట్రోల్ యూనిట్ లో నమోదయిన మొత్తం ఓట్ల వివరాలు చూపించి, తరువాత అభ్యర్థుల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు అందరికి స్పష్టంగా తెలిసేలా చూపించాలని, ఆ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు. కౌంటింగ్ హాలులో 14 టేబుల్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ,మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, నియోజకవర్గానికి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని, భూపాలపల్లిలో 23 రౌండ్లు ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని, 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తో కౌంటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. 

నియోజకవర్గ పరిధిలో 5 ఈవిఎం లను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి, వివి ప్యాట్ల ఓట్ల లెక్కింపు చేయడం జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ హాల్లో అధికారులు సిబ్బంది మౌనంగా ఉండాలని, ప్రశాంతంగా వ్యవహరించాలని, ఎటువంటి సందర్భం ఎదురు అయినప్పటికీ ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ చూసుకోవాలని కోరారు. వివిప్యాట్ స్లిప్పుల లెక్కింపు అప్రమత్తంగా చేయాలని, అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆ స్లిప్పులను బ్లాక్ కవర్ లలో భద్రపర్చి సీల్ చేయాలని, ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ప్రక్రియ మొత్తం వీడియో గ్రఫీ చేయాలని సూచించారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత ఆ రౌండ్ లో ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలను ఎన్నికల కమిషన్ నిర్దేశించిన పోర్టల్ లో నమోదు చేసి రిటర్నింగ్ అధికారికి అందించాలని, కంట్రోల్ యూనిట్లు ఓపెన్ కాని పక్షంలో రిటర్నింగ్ అధికారికి వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.  కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని , అందుకు అవసరమైన తనిఖీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారి, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.