బీజేపీ టిక్కెట్ దక్కని ఎమ్మెల్యే ఇంటికి అశోక్ గెహ్లాట్ 

బీజేపీ టిక్కెట్ దక్కని ఎమ్మెల్యే ఇంటికి అశోక్ గెహ్లాట్ 
  • అర్థరాత్రి సందర్శనపై ఎన్నెన్నో ఊహాగానాలు

రాజస్థాన్ : రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయాలు క్రమేణా వేడెక్కుతున్నాయి. ఒక పార్టీలో టిక్కెట్లు రాని నేతలను ప్రత్యర్థి పార్టీల నాయకులు కలుస్తూ రాజకీయాలను మరింతగా హీటెక్కిస్తున్నారు. ఇలాంటి ఒక ఆసక్తికర పరిణామం సోమవారం రాత్రి చోటుచేసుకుంది. భీజేపీ నుంచి టిక్కెట్ లభించని సుర్ సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సూర్యకాంత వ్యాస్ ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్లి కలిసి చర్చించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది తెలియకపోయినా, ప్రస్తుత ఎన్నికలలో టిక్కెట్ రాని ఒక బీజేపీ ఎంఎల్ఏ ఇంటికీ స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి చర్చించడం ఇక్కడ రాజకీయాలను బాగా వేడెక్కించింది. వాస్తవంగా సూర్యకాంత వ్యాస్ సీఎం అశోక్ గెహ్లాట్ కు బంధువుగా చెబుతారు. ఏదియేమైనా వీరిద్దరి కలయిక పెద్ద చర్చకే దారితీసింది. ఒకవేళ సూర్యకాంత వ్యాస్ కాంగ్రెస్ లో చేరితే ఇక్కడ రాజకీయ పరిణామాలు చాలావరకు మార్పు చెందుతాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీలు ఊపిరిసలపని రీతిలో ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైనందున ఈ ఊహించని రాజకీయ వ్యూహం అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు పలు ఊహాగానాలకు దారి తీస్తోంది.