BRS ఖమ్మం సభకు సర్వం సిద్ధం

BRS ఖమ్మం సభకు సర్వం సిద్ధం

ఖమ్మం, ముద్ర ప్రతినిధి : ఈ నెల 18 ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన భారత రాష్ట్ర సమితి (BRS) జాతీయ తోలి సభ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించి, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం ఆదేశాలతో ఇప్పటికే మంత్రి హరీష్ రావు జిల్లా చేరుకొని దగ్గరుండి సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పొరుగునే ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని పది నియోజకవర్గాలు కలిపి.. మొత్తంగా 20 నియోజకవర్గాల నుంచి ఐదు లక్షల మందితో సభకు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండే సింహభాగంగా 3 లక్షల మంది జనం సమీకరణ కోసం నియోజకవర్గంలో వారిగా నేతలు సమీక్షలు జరిపారు. 

ఖమ్మం నగరం శివారు వివి పాలెం కొత్త కలెక్టరేట్ వద్ద వంద ఎకరాల్లో బహిరంగ సభ జరుగుతుంది. పార్కింగ్ 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారని నేతలు తెలిపారు. ఖమ్మం సభ ద్వారా దేశ రైతాంగం, ప్రజలు, రాజకీయ వర్గాలకు బీఆర్‌ఎస్‌ ఎజెండాపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది అని, సభకు ముగ్గురు ముఖ్యమంత్రుల, ఒక మాజీ ముఖ్యమంత్రి హాజరుకానున్నారని నాయకులు వివరించారు. 18న సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని మంత్రి హరీష్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.