ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం

ఒడిశాలో  ఘోర రైలు ప్రమాదం
  • ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ప్రమాద ఘటన
  • ప్రమాదంలో బోల్తాపడిన ఏడు బోగీలు
  • పలువురు ప్రయాణికులకు గాయాలు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్‌పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మొత్తం 13 బోగీలు మరో ట్రాక్‌పై పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పక్క ట్రాక్‌పై వస్తోన్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు కోరమాండల్ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నెంబర్ 06782262286కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. రైల్వే అత్యవసర విభాగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుంచి కోల్‌కతా వెళుతోంది. శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ప్రమాద ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు అధికారులు. రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సిగ్నల్ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు భారీగా ధ్వంసం అయింది. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 60 అంబులెన్స్ లు సేవలందిస్తున్నాయి.

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదం నుంచి అంతా క్షేమంగా బయటపడాలని కోరుకున్నారు. ఘటనపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేలు ప్రకటించింది. కాగా, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురికావడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్ వద్ద ఈ సాయంత్రం గూడ్స్ రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో సమయన్వయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైనవారు 033- 22143526/ 22535185 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

ప్రమాదానికి సంబంధించిన వివరాలను రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ తెలియజేస్తూ..

"శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో, 2841 షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని 10-12 కోచ్‌లు బాలాసోర్ సమీపంలో పట్టాలు తప్పడంతో పాటు ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. కొంత సమయం తరువాత యశ్వంత్‌పూర్ నుండి హౌరాకు వెళ్లే రైలు నంబర్ 2864 పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొట్టింది. దీని కారణంగా దాని 3-4 కోచ్‌లు పట్టాలు తప్పాయని  తెలిపారు. ప్రస్తుతం రైల్వే రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. ఎవరైనా ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయారా అనేది ధృవీకరించబడలేదు. అయితే చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సౌత్-ఈస్ట్రన్ జనరల్ మేనేజర్ స్పాట్‌కి బయలుదేరారు. దీంతో పాటు సమీపంలోని డీఆర్‌ఎం తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి బయలుదేరారు.