బాబు అరెస్టుకు నిరసనగా ఏపీలో కొనసాగుతున్న బంద్​

బాబు అరెస్టుకు నిరసనగా ఏపీలో కొనసాగుతున్న బంద్​

అమరావతి:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు  సోమవారం ఆంధ్రప్రదేశ్​లో బంద్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు  రోడ్లపై బైఠాయించి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పలు చోట్ల బస్సులను అడ్డుకున్నారు. బంద్‌కు జనసేన, సీపీఐ, లోక్ సత్తా, ఎంఆర్​పీఎస్​ సహా వివిధ వర్గాలు, పార్టీలు  మద్దతు తెలిపాయి. బంద్ నేపథ్యంలో   పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ బస్టాండ్లు, పలు కూడళ్లలో  టీడీపీ నాయకులు  ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నియోజకవర్గ ఇన్ ఛార్జి చదలవాడ అరవిందబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. నిరసనలకు, ర్యాలీలకు అనుమతి లేదంటూ అరవిందబాబును పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, గిద్దలూరులో డిపో వద్ద ఆర్టీసీ సర్వీసులను నిలిపేయాలని  ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. తెలుగుదేశం కార్యకర్తలను కనిపించిన చోటల్లా పోలీసులు అదుపులో తీసుకుని వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. బస్సులను దగ్గరుండి బయటకు పంపిస్తున్నారు.

పాడేరులో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వాహనాలను అడ్డుకుంటున్న టీడీపీ  కార్యకర్తలను నిలువరిస్తున్నారు. బంద్ తో రహదారులపై వాహనాల రద్దీ తగ్గింది.  వైఎస్సార్​ జిల్లా మైదుకూరులో  టీడీపీ  నియోజకవర్గ ఇన్ ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా సుధాకర్ యాదవ్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కడపలో నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. శనివారమే ఈ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు, ఆంక్షలు విధించారు. డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు అందిన ఆదేశాల మేరకు ఎక్కడిక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ లు 144 సెక్షన్ విధిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ సెక్షన్ అమలు చేస్తున్నారు.